చైనాకు శాంసంగ్ షాక్.. నోయిడాలో రూ.4,825 కోట్ల పెట్టుబడులు
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ సంస్థ చైనాకు షాక్ ఇచ్చింది. భారతదేశంలో భారీ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. శాంసంగ్ నోయిడాలో రూ.4,825 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. మొబైల్, ఐటీ డిస్ ప్లే ప్రొడక్షన్ యూనిట్‌ను చైనా నుంచి భారత్‌కు తరలించనుంది. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో నోయిడాలో భారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. దేశంలోనే శాంసంగ్‌కు చెందిన తొలి హై-టెక్నిక్ ప్రాజెక్ట్‌గా దీన్ని చెప్పనున్నారు.
మిడ్-వేరియంట్ సెగ్మెంట్‌లో శాంసంగ్ మొబైల్స్‌ను భారత్‌లో పెద్ద ఎత్తున విక్రయిస్తూ ఉన్నారు. దీనితో పాటూ చైనా కంపెనీలను భారతీయులు దూరం పెడుతూ ఉండడంతో శాంసంగ్ భారతీయులకు మరింత దగ్గరవ్వాలని ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది.
యూపీ ప్రభుత్వం శాంసంగ్ డిస్‌ప్లే నోయిడా ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలను శుక్రవారం ఆమోదించింది. యూపీ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ పాలసీ 2017 ప్రకారం భూమిని బదిలీ చేయడంలో శాంసంగ్‌కు స్టాంప్ డ్యూటీ మినహాయింపు లభించనుంది. అలాగే తయారీ ఎలక్ట్రానిక్ భాగాలు, సెమీ కండక్టర్ల ప్రమోషన్ కోసం భారత ప్రభుత్వ పథకం కింద ఇది 460 కోట్ల రూపాయల ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందుకోనుంది.