వోడాఫోన్ ఐడియా మూసివేత?.. రోడ్డునపడనున్న 14వేల మంది ఉద్యోగులు!
దేశం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనుకుంటున్నవేళ మరో పెద్ద కంపెనీ దివాళా తీయడం దాదాపుగా ఖరారైంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వోడాఫోన్ ఐడియా కంపెనీకి సుప్రీంకోర్టులో సోమవారం భారీ ఎదురుదెబ్బ తగిలింది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) బకాయిల విషయంలో ఎలాంటి మినహాయింపులు ఇవ్వబోమని న్యాయస్థానం తేల్చిచెప్పడంతో కంపెనీ ఇరుకునపడింది.
కోర్టు, ప్రభుత్వం కనికరించకుంటే కంపెనీ మూసేయడమే మార్గమన్న వోడాఫోన్ ఐడియా యాజమాన్యానికి ఇప్పుడు మిగిలినదారి అదొక్కటే. మరోవైపు భారతి ఎయిర్ టెల్ సంస్థ మాత్రం మొత్తం బకాయిలో రూ.10 వేల కోట్లు చెల్లించి కాస్త ఉపశమనం పొందింది. టెల్కోల ఏజీఆర్ బకాయిలకు సంబంధించి సోమవారం సుప్రీంకోర్టు, టెలిక్యూనికేషన్ల శాఖ(డాట్)లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.
దిగొచ్చిన ఎయిర్ టెల్
లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రం వినియోగ ఛార్జీల కింద టెల్కోల నుంచి ప్రభుత్వానికి మొత్తం రూ.1.47 లక్షల కోట్ల బకాయిలు రావాల్సిఉంది. ఇందులో ఎయిర్ టెల్ భారతి వాటా 35,500 కోట్లుకాగా.. శుక్రవారం నాటి డాట్ నోటీసుల తర్వాత తాము రూ.10 వేల కోట్లు చెల్లిస్తామంటూ ఆ కంపెనీ ముందుకొచ్చింది. చెప్పిన మేరకు సోమవారం చెల్లింపులు కూడా చేసింది. ‘‘భారతి ఎయిర్‌టెల్ బకాయిల్లో రూ.9500, భారతి హెక్సాకామ్‌కు సంబంధించిన రూ.500 కోట్లను సోమవారం డాట్‌కు చెల్లించాం'' అని కంపెనీ ప్రకటించింది. మిగిలిన రూ.25,500 బకాయిని తదుపరి కోర్టు వాయిదా(మార్చి 17) నాడు కట్టేస్తామని ఎయిర్ టెల్ పేర్కొంది. అయితే వోడాఫోన్ ఐడియాకు మాత్రం కోర్టులో షాక్ తగిలింది.
సుడిగుండంలో వోడాఫోన్ ఐడియా
కాగా టెలికాం రంగంలో తీవ్ర పోటీ నేపథ్యంలో విలీనం తరువాత అతిపెద్ద సంస్థగా అవతరించిన వోడాఫోన్ ఇండియా భారీ అప్పుల్లో కూరుకుపోయింది. లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రం వినియోగ ఛార్జీల కింద ఆ సంస్థ ప్రభుత్వానికి రూ.53 వేల కోట్లు చెల్లించాల్సిఉంది. డాట్ గడువు కూడా ముగిసిన నేపథ్యంలో సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కంపెనీ.. మొత్తం బకాయిలో రూ.3500 వేల కోట్లు మాత్రమే చెల్లించేస్థితిలో ఉన్నామని, దయచేసి మరికొంత గడువిస్తే సర్దుబాటు చేసుకుంటామని, ఈలోపు న్యాయపరమైన చర్యలకు ఆదేశించొద్దని కోర్టుకు విన్నవించుకుంది. దీనికి కోర్టు ఏం చెప్పిందంటే.
కనికరించని కోర్టు
చెల్లించాలనుకుంటున్న రూ.3500వేల కోట్లలో తక్షణమే(సోమవారమే)రూ.2500కోట్లు ఇస్తామని, మిగిలిన రూ.1000కోట్లు శుక్రవారం నాటికి కడతామని వోడాఫోన్ ఐడియా తెలిపింది. మొత్తం బకాయిపై ముదింపు కోరుతోన్న కంపెనీ.. తమకుగానీ ఉపశమనం కల్పించకపోతే సంస్థను మూసుకోవాల్సి వస్తుందని మరోసారి కోర్టుకు తెలిపింది. అయితే జడ్జిలు మాత్రం ఈ వాదనను తోసిపుచ్చారు. ఇప్పటికే చాలాసార్లు గడువు ఇచ్చిచూశామని, ఇకపై ఎలాంటి మినహాయింపులు ఉండబోవని జడ్జిలు స్పష్టం చేశారు. దీంతో కంపెనీ దివాళా ప్రకటించడం ఖాయమనే అభిప్రాయం వెల్లడవుతోంది.
ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన
ఏజీఆర్ బకాయిల చెల్లింపు విషయంలో సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించకపోవడంతో వోడాఫోన్ ఐడియా సంస్థ భవిష్యత్తు దాదాపు అంధకారమయమయ్యే పరిస్థితి నెలకొంది. కోర్టు, ప్రభుత్వం ఒత్తిడి పెంచితే కంపెనీని మూతేయడం తప్ప మరోదారి లేదని సంస్థ మొదటి నుంచీ వాదిస్తోంది. అదే జరిగితే.. ఇండియాలోని అతిపెద్ద ప్రవేటు టెలికాం సంస్థ దివాళా తీసినట్లవుతుంది. ప్రస్తుతం ఆ సంస్థలో పనిచేస్తోన్న దాదాపు 14వేల మంది ఉద్యోగులు జరుగుతున్న పరిణామాలతో ఆందోళనలో మునిగిపోయారు. ఇతర కంపెనీలేవీ వోడాఫోన్ ఐడియాను కొనడానికి కూడా ముందుకురాని పక్షంలో ఆ 14వేల మంది రోడ్డునపటం ఖాయం.
బ్యాంకులపైనా భారీ ఎఫెక్ట్
ఏజీఆర్ బకాయిల చెల్లింపుల వ్యవహారంలో ఏదైనా టెలికం సంస్థ దివాలా తీస్తే ఆ ఎఫెక్ట్ బ్యాంకులపైనా భారీగా ఉండనుంది. బాకీల చెల్లింపు విషయంలో సుప్రీంకోర్టు షాకివ్వడంతో వోడాఫోన్ ఐడియా సంస్థ దివాలా తీయడం దాదాపు ఖరారైనట్లేనని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా టెలికం సంస్థ మూతబడితే బ్యాంకులు, ఉద్యోగులు, వ్యాపారులు, వినియోగదారులు అంతా ప్రభావితం అవుతారని అన్నారు. బాకీలు పడ్డ అన్ని టెలికం కంపెనీల్లోకి ఒక్క రిలయన్స్ జియో మాత్రమే తన రూ.170కోట్ల అప్పును తిరిగిచ్చేసింది.