ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 28 జులై 2023 (13:41 IST)

వాట్సాప్‌లో షార్ట్ వీడియో మెసేజ్ ఫీచర్

whatsapp
సోషల్ నెట్వర్కింగ్ ప్రసార మాధ్యమాల్లో వాట్సాప్ ఒకటి. ఏదైనా సమాచారాన్ని అందించాలనుకుంటే టెక్ట్స్ లేదా వాయిస్ సందేశాల రూపంలో పంపించవచ్చు. అదే విషయాన్ని మరింత స్పష్టంగా తెలియజేయాలనుకుంటే వీడియో ద్వారా పంపించాల్సి ఉంటుంది. కానీ, వాట్సాప్‌లో వీడియో పంపాలంటే ముందుంగా రికార్డ్ చేసి తర్వాత వాట్సాప్‌ ద్వారా షేర్ చేయాలి. కానీ, ఇప్పుడు అంత కష్ట పడాల్సిన అవసరం లేదు. వాట్సాప్‌ తీసుకొచ్చిన ఈ ఫీచర్‌తో రియల్ టైమ్‌ వీడియో రికార్డ్‌ను పంపవచ్చు.
 
ఇన్‌స్టాంట్‌ వీడియో సందేశాన్ని అందించటం కోసం ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ షార్ట్‌ వీడియో మెసేజ్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఉన్న రియల్‌ టైమ్ వాయిస్ మెసేజ్‌లానే ఈ ఇన్‌స్టాంట్‌ వీడియో మెసేజింగ్‌ ఆప్షన్‌ ఉపయోగించవచ్చని తెలిపింది. 60 సెకన్ల వరకు వీడియో సందేశాన్ని పంపవచ్చని వాట్సాప్ ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియోను మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఫేస్‌బుక్‌ ఖాతాలో పంచుకున్నారు.
 
టెక్ట్స్ బాక్స్ పక్కనున్న వాయిస్ రికార్డ్‌ ఆప్షన్ సాయంతో ఈ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు. రికార్డ్‌ సింబల్‌ను కొన్ని సెకన్ల పాటు హోల్ట్ చేస్తే అది వీడియో ఆప్షన్‌కు మారుతుంది. ఇక దాని సాయంతో 60 సెకన్ల పాటు వీడియోను రికార్డ్‌ చేసి పంపవచ్చు. అయితే ఈ వీడియో ప్లే చేస్తే డీఫాల్ట్‌గా సౌండ్‌ లేకుండా ప్లే అవుతుంది. 
 
సౌండ్‌ రావాలంటే వీడియోపై మరోసారి ట్యాప్ చేయాల్సి ఉంటుందని వాట్సాప్‌ తెలిపింది. ఈ ఫీచర్‌ను ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వాట్సాప్‌ తెలిపింది. అయితే, ఈ ఫీచర్‌ ఇప్పటికే కొందరికి అందుబాటులోకి రాగా, మిగిలిన వారందికీ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌ను వినియోగించాలనుకొనే వారు వాట్సాప్‌ యాప్ లేటెస్ట్‌ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.