ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 జూన్ 2023 (17:25 IST)

మీ మొబైల్‌ ఫోనును ఎవరైనా కొట్టేశారా?

mobile massage
సాధారణంగా బస్సుల్లో ప్రయాణం చేసే సమయాల్లో, విందులు, వినోదాలు, పెళ్లిళ్ల సమయంలో మొబైల్స్ చోరీకి గురవుతుంటాయి. మరికొందరు ఎక్కడైనా పెట్టి మరిచిపోతుంటారు. బస్సు లేదా రైలు ఎక్కుతున్న సమయంలో ఫోను ప్యాకెట్‌ నుంచి జారి కిందపడిపోతుంది. ఇలా ఫోన్ పోగొట్టుకునేవారు కాలు కదపకుండానే పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. 
 
మీ సమీపంలోని పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలన్న నిబంధన లేదు. పోయిన ఫోన్లను ట్రాక్ చేయడానికి, బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకోవడానికి ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్ అధికారులు కొత్తగా ఒక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను రూపొందించారు. అటు ఫోను పోగొట్టుకున్న వారి నుంచి ఫిర్యాదు స్వీకరించడానికి, ఇటు అత్యవసర పరిస్థితుల్లో పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేయడానికి వీలుగా ఈ అప్లికేషన్‌ను అభివృద్ధి చేశారు. 
 
ఈ జిల్లా పోలీసు కమిషనరేట్ పరిధిలో రోజుకు 10 - 15 వరకు ఫోన్లకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయి. కమిషనరేట్ పక్కనున్న సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌కు బాధితులు వస్తున్నారు. కొంతమంది తమ పరిధిలోని స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదలు చేస్తున్నారు. అక్కడి నుంచి పోలీసులు వారిని సైబర్ క్రైం విభాగానికి పంపుతున్నారు. ఇక్కడ రిసిప్షన్ సిబ్బంది రాతపూర్వకంగా ఫిర్యాదు తీసుకుని, దానికి ఒక నంబర్ ఇస్తున్నారు. 
 
ఫోన్ దొరికిన తర్వాత ఫిర్యాదుదారులకు సమాచారం ఇస్తున్నారు. ఫోన్ కొన్న బిల్లు చూపించిన తర్వాత ఫోన్‌ను అందజేస్తున్నారు. ఇక నుంచి ఇలాంటి ప్రయాసలు లేకుండా ఇంటి నుంచి గానీ, ఫోన్ పోయిన ప్రదేశం నుంచి గానీ ఫిర్యాదు చేయవచ్చు. దీనికి ప్రత్యేకంగా 9440627057 నంబరు ఏర్పాటు చేశారు. ఫోన్ నంబరుకు ఒక వాట్సాప్ సందేశం పంపిస్తే చాలు.