రెండు రోజుల్లో ప్రవేశించనున్న రుతుపవనాలు... ఏపీకి మూడు రోజుల వర్ష సూచన
మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ రుతపవనాలు ప్రవేశించేందుకు సానుకూల పరిస్థితులు ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ తమిళనాడు పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు తెలిపింది.
ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు విదర్భ నుండి దక్షిణ తమిళనాడు మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి ౦.9 కి.మీ ఎత్తున విస్తరించి ఉన్నట్లు తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని తెలిపింది. ఒకటి రెండు చోట్ల గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపింది. బుధవారం కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కొన్ని చోట్ల గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలు వీచే అవకాశమున్నట్లు వెల్లడించింది.