ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. లోక్ సభ ఎన్నికలు 2024
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 28 ఏప్రియల్ 2024 (11:06 IST)

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరో బర్రెలక్క!!

vote
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరో బర్రెలక్క అవతరించారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా, కోర్బా జిల్లాలోని కోర్బా నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. ఇపుడు ఆమె హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి ఆమె ఓ నిరుపేదరాలు. రూ.2 వేలకు మించి బ్యాంకు బ్యాలెన్స్ లేదు. అయినా ఆమె ఈసారి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం స్థానికంగా సంచలనంగా మారింది. అర్థబలం, అంగబలం లేకపోయినా హేమాహేమీలతో పోటీ పడుతున్న ఈమె పేరు శాంతిబాయి మారావీ. 
 
కోర్బా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా జ్యోత్స్యా మహంత్, బీజేపీ తరపున సరోజ్ పాండే బరిలో ఉన్నారు. కోట్ల విలువైన ఆస్తుల కలిగిన వీరు తమ మందీమార్బలంతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ, శాంతిబాయి మాత్రం సామాన్యురాలు. ఆమెకున్న రెండు బ్యాంకు అకౌంట్లలోని ఒకదాంట్లో చిల్లిగవ్వ కూడా లేదు. రెండో దాంట్లో కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. చేతిలో రూ.20 వేల నగదు, 10 గ్రాముల బంగారం, 50 గ్రాముల వెండి ఉంది. 
 
శాంతిబాయి చదివింది ఐదో తరగతి మాత్రమే. ఆమెకు పాన్‌కార్డు లేదు. సోషల్ మీడియాపై అసలు అవగాహనే లేదు. ఒకటిన్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న ఆమెకు వ్యవసాయం, కూలిపనులే జీవనాధారం. రాజకీయంగా ఇన్ని ప్రతికూతలలు ఉన్నా శాంతిబాయి ధైర్యంగా ఎన్నికల్లో పోరాడేందుకు సిద్ధమైంది. నామినేషన్ కూడా వేసి వచ్చింది. ఆ తర్వాత నుంచి ఆమె మొబైల్ స్విచ్ఛాప్ అని వస్తుండటం ఓ కొసమెరుపు.