ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (14:40 IST)

ఆగస్టు 15న రుణమాఫీ చేస్తాం.. హామీ నిలబెట్టుకుంటాం : మంత్రి వెంకట్ రెడ్డి

komatireddy
గత ఎన్నికల్లో తమ పార్టీ హామీ ఇచ్చినట్టుగానే ఆగస్టు 15వ తేదీన రైతులకు రుణమాఫీ చేసి ఇచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకుంటామని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీలకు మూడెకరాల భూమి ఇస్తామని మోసగించారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... భారత రాష్ట్ర సమితి హయాంలో ఉపాధిహామీ కూలీలకు కనీసం వంద రోజుల ఉపాధి కల్పించలేదన్నారు. కాంగ్రెస్‌ను విమర్శించడం ఆ పార్టీ నేతలు మానుకోవాలన్నారు. ఆగస్టు 15న రుణమాఫీ హామీ నిలబెట్టుకుంటామన్నారు. ఎమ్మెల్యే పదవి వదులుకునేందుకు హరీశ్‌రావు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
 
'గతంలో నేను మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్నా. మెదక్‌లో భారాస కనీసం డిపాజిట్‌ దక్కించుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ ఫాంహౌస్‌లో నుంచి బయటకు రాలేదు. ఇప్పుడు కర్ర పట్టుకుని వస్తున్నారు. సచివాలయానికి రేవంత్‌ రెడ్డి వచ్చిన దాంట్లో పది శాతం కూడా ఆయన రాలేదు. మూడు నెలల్లో రేవంత్‌ 60 సార్లు సచివాలయానికి వచ్చారు. కేసీఆర్‌ పాలనలో హోంమంత్రికి కూడా అపాయింట్‌మెంట్‌ లేదు. పార్టీ మూతపడే స్థితికి వచ్చినందున ఎక్కడికి వెళ్లాలో వారికి అర్థం కావట్లేదు. రైతులపై ప్రేమ ఉన్నట్లు హరీశ్‌ రావు నాటకాలాడుతున్నారు. రాజీనామా పత్రం ఒకటిన్నర పేజీ రాశారు. నిజానికి అది ఒకటిన్నర లైను మాత్రమే ఉండాలి. అంతకు మించితే ఆమోదం పొందదు. 
 
తెరాస అధికారంలోకి వస్తే తొలి సీఎం దళితుడని నాడు కేసీఆర్‌ చెప్పారు. దళితుడిని సీఎం చేయకపోతే మెడపై తల ఉండదని గొప్పలు చెప్పారు. పరిపాలన అనుభవం ఉండాలని చెప్పి తొలిసారి ఆయనే సీఎంగా ఉన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చినా దళితుడిని సీఎం చేయలేదు. అధికారం పోగానే ఆయన పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ వచ్చాక ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నాం. దొంగ రాజీనామా లేఖలను ఎందుకు ఇస్తున్నారు. హామీలు అమలు చేయకపోతే ప్రజలను క్షమాపణ కోరి ఉండేవాళ్లం. గతంలో నేను పదవి వదులుకున్నా.. పదవులు శాశ్వతమా? రైతులపై ప్రేమ ఉంటే హరీశ్‌రావు రాజీనామా లేఖను స్పీకర్‌కు ఇవ్వాలి' అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.