శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (17:31 IST)

తిరుపతి అసెంబ్లీ ఎన్నికల బరిలో 25 మంది స్వతంత్ర అభ్యర్థులు!

bhumana
లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు కూడా మే నెల 13వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల కోసం నామినేషన్ల దాఖలు ఘట్టం గురువారంతో ముగియగా, శుక్రవారం నామినేషన్లను ఎన్నికల సంఘం అధికారులు పరిశీలించారు. ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. అయితే, తిరుపతి అసెంబ్లీ స్థానంలో ఏకంగా 25 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 
 
దీనిపై సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఏజెంట్లను కూడా పెట్టుకోలేని 25 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయడం వెనుక కుట్ర దాగుందన్నారు. చిత్తూరు నుంచి వచ్చిన రౌడీలు, గూండాలు పోలింగ్ బూత్‌‍లలో ఏజెంట్లుగా కూర్చోవడానికి వీల్లేదని చెప్పారు. దీనిపై ఎన్నికల సంఘం దర్యాప్తు చేయించాలని, స్థానికంగా ఉన్న వారినే బూత్ ఏజెంట్లుగా నియమించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 
 
అంతేకాకుండా, తిరుపతిలో భయోత్పాతాన్ని సృష్టించేందుకు కూటమి కుట్రలు చేస్తుందని ఆయన ఆరోపించారు. చిత్తూరు నుంచి రౌడీ మూకలు, గూండాలను దింపి అల్లర్లు చేయాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ కుట్ర కోణంపై ఎన్నికల సంఘం దృష్టిసారించాలని కోరారు. పైగా, తమపై పోటీ చేస్తున్న జనసేన పార్టీ అభ్యర్థికే మొత్తం అన్ని బూత్‌లలో ఏజెంట్లను నియమించుకునే పరిస్థితి లేదని ఆయన వ్యాఖ్యానించారు.