సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 20 ఆగస్టు 2022 (14:27 IST)

మథుర బంకీ బిహారీ ఆలయంలో తొక్కిసలాట.. ఇద్దరు భక్తుల మృతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో చిన్నపాటి అపశృతి జరిగింది. మథురలో ఉన్న బంకీ బిహారీ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఉదయం ఒక్కసారిగా భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో స్వల్పంగా తొక్కిసలాట జరిగింది. ఇందులో ఇద్దరు భక్తుల ప్రాణాలు కోల్పోగా, మరో పది మంది వరకు గాయపడినట్టు సమాచారం. 
 
శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత తెల్లవారితే శనివారం 1.45 గంటల సమయంలో మంగళ హారతి సమయంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో ఊపిరి ఆడక ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారని జిల్లా మేజిస్ట్రేట్, కలెక్టర్ నవనీత్ సింగ్ చాహల్ వెల్లడించారు. 
 
మృతుల్లో నోయిడాకు చెందిన 55 యేళ్ళ మహిళతో పాటు జబల్‌పూర్‌కు చెందిన 65 యేళ్ల మహిళ ఉన్నట్టు ఆయన తెలిపారు. ఈ సంఘటనపై స్థానిక అధికారులు, పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆలయంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.