సోమవారం, 2 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 8 జనవరి 2023 (09:43 IST)

ఎనిమిదో తరగతి విద్యార్థినికి ఉపాధ్యాయుడి ప్రేమలేఖ!

letter
తన వద్ద చదువుకునే విద్యార్థినికి ఓ ఉపాధ్యాయుడు ప్రేమలేఖ రాశారు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బల్లార్‌పూర్ జిల్లాలో వెలుగుచూసింది. తాను మనసుపడిన విద్యార్థినికి ఉపాధ్యాయుడు స్వయంగా తన చేతిరాతతో ప్రేమలేఖ రాశారు. దీనిపై బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు. పైగా, ఈ విషయంపై విద్యాశాఖ అధికారులు సీరియస్‌గా స్పందించి గురువుని విధుల నుంచి సస్పెండ్ చేశారు. 
 
ఇంతకీ ప్రేమలేఖ రాసిన ఉపాధ్యాయుడి వయసు 47 యేళ్లు. బాలిక వయసు 13 యేళ్ళు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బల్లార్‌పూర్ జిల్లా సదర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. హరిఓమ్ సింగ్ అనే ఉపాధ్యాయుడు గత డిసెంబరు నెల 30వ తేదీన ఓ బాలికకు కొత్త సంవత్సర గ్రీటింగ్ కార్డు ఇచ్చాడు. 
 
ఆ తర్వాత దాన్ని ఇంటికెళ్లి చదువుకోమని చెప్పాడు. అభంశుభం తెలియని ఆ విద్యార్థిని కూడా అలానే చేసింది. ఆ విద్యార్థిని ఆ లేఖను చదివిన తర్వాత నేరుగా తన తల్లిదండ్రులకు విషయం చెప్పిందే. వారు పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు.