అలిగిన బీజేపీ సీనియర్లు.. పార్టీకి నటి విజయశాంతి టాటా
భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వంపై తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ బీజేపీ నేతలు అలిగారు. ముఖ్యంగా, పార్టీలో సుధీర్ఘకాలంగా కొనసాగుతున్న తమను కాదని నిన్నామొన్నా పార్టీలో చేరిన వారిని ప్రోత్సహించడాన్ని, పదవులు కట్టబెట్టడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో పార్టీని వీడాలని వారు భావిస్తున్నారు.
ముఖ్యంగా, టీఎస్ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి, మాజీ మంత్రి, కాంగ్రెస్ మాజీ మహిళా నేత డీకే అరుణకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి, మాజీ మంత్రి, బీఆర్ఎస్ మాజీ నేత ఈటెల రాజేందర్‌కు ప్రచార కమిటీ అధ్యక్ష పదవిని ఇస్తారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.
ఈ నేపథ్యంలో పార్టీలో సీనియర్లుగా ఉన్న తమకు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదని తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలైన సినీ నటి విజయశాంతి, మాజీ మంత్రి గడ్డం వివేక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఏపీ జితేందర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, విఠల్, రవీంద్రనాయక్, దేవయ్య ప్రశ్నిస్తున్నారు. అందుకే వీరింతా కలిసి జితేందర్ రెడ్డి ఇంట్లో కీలక సమావేశం నిర్వహించారు. కొద్దిరోజులుగా కేంద్ర నాయకత్వం మీద గుర్రుగా ఉన్న వీరు ఈ భేటీతో బీజేపీని వీడతారా అంటూ ప్రచారం ఊపందుకుంది.