బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 1 జనవరి 2017 (13:02 IST)

సమాజ్ వాదీ పార్టీలో మళ్లీ వార్... అఖిలేష్‌ జాతీయ అధ్యక్షుడు.. అమర్ సింగ్ బహిష్కరణ

ఉత్తరప్రదేశ్ అధికార సమాజ్ వాదీ పార్టీలో మళ్లీ తండ్రీ కొడుకుల మధ్య వార్ మొదలైంది. సుఖాంతమైందనుకున్న ఆధిపత్య పోరు తిరిగి ప్రారంభమైంది. తండ్రీ కొడుకులమధ్య యుద్ధం ముదిరి పాకాన పడుతోంది. పార్టీ చీఫ్ ములాయం

ఉత్తరప్రదేశ్ అధికార సమాజ్ వాదీ పార్టీలో మళ్లీ తండ్రీ కొడుకుల మధ్య వార్ మొదలైంది. సుఖాంతమైందనుకున్న ఆధిపత్య పోరు తిరిగి ప్రారంభమైంది. తండ్రీ కొడుకులమధ్య యుద్ధం ముదిరి పాకాన పడుతోంది. పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి రాం గోపాల్ యాదవ్ ఆదివారం పెద్దఎత్తున పార్టీ జాతీయ కార్యవర్గ సదస్సును నిర్వహించారు.
 
ఈ సదస్సులో సీఎం అఖిలేష్ యాదవ్ పాల్గొనడమే కాదు.. తండ్రి ములాయం స్థానంలో జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఈ ఎన్నిక జరిగిందని రామ్ గోపాల్ యాదవ్ ప్రకటించారు. సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా శివపాల్ యాదవ్‌ను తొలగించామని, అమర్ సింగ్‌ను బహిష్కరిస్తున్నామని తెలిపారు. 
 
అఖిలేష్‌పై ఆయన తండ్రి ములాయంకు ఆగ్రహం కలిగేట్టు అమర్ సింగ్ ఆయనను రెచ్చగొడుతున్నారని రాం గోపాల్ యాదవ్ ఆరోపించారు. లక్నోలో జరిగిన ఈ సదస్సుకు సుమారు 5 వేలమంది పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. అనేకమంది అఖిలేష్‌కు మద్దతుగా జై అఖిలేష్ అంటూ నినాదాలు చేశారు. 
 
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ అఖిలేష్‌ను, ఆయన సన్నిహితుడు రాం గోపాల్ యాదవ్‌ను ములాయం సింగ్ మొదట పార్టీ నుంచి బహిష్కరించినా.. ఆ తరువాత బహిష్కరణ వేటును ఎత్తివేశారు. షో అంతా బాగానే ఉందని అంతా ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మళ్ళీ తండ్రీ కొడుకుల మధ్య వార్ మొదలైంది.