మీ దుప్పట్లు మీరే తెచ్చుకోండి.. యోగాతో కరోనా దూరం
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. దీంతో రైల్వే శాఖ కూడా అప్రమత్తమైంది. ప్రయాణికులు ఎవరికి వారే వారి సొంత బ్లాంకెట్లను తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేసింది. కరోనా వ్యాప్తి చెందడంతో ఏసీ బోగీల్లో ప్రయాణించే ప్రయాణికులకు కర్టెన్లతో పాటు బ్లాంకెట్లను కలిపించే సదుపాయాన్ని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు రైల్వే పీఆర్వో ప్రకటించారు.
ఏసీ బోగీల్లో వినియోగించే కర్టెన్లు, బ్లాంకెట్లను ఓ ట్రిప్ పూర్తి కాగానే ఉతికి శుభ్రపరచడానికి వీలుండదని, ఈ కారణంతో వైరస్ సోకే ప్రమాద ముందని ఆయన తెలిపారు. కేవలం బ్లాంకెట్లు మాత్రమే కాకుండా, ప్రయాణికులకు అవసరమైన దుప్పట్లు, ఇతరత్రా వాటిని ఎవరికి వారే తెచ్చుకోవాలని రైల్వే శాఖ స్పష్టం చేసింది.
యోగాతో కరానా చెక్
మరోవైపు, యోగా ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని, తద్వారా కరోనాకు దూరంగా ఉండాలని ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదని, ఎవరికి వారు రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, వైరస్ వ్యాపించకుండా నివారణ చర్యలు తీసుకోవాలని, ప్రయాణాల్లో శానిటైజర్లు వాడాలని సూచించారు. ఇతరుల నుంచి నాలుగైదు అడుగుల దూరంలో ఉండాలని, మాస్కులు ధరించాలని అన్నారు.
ప్రతి రోజూ యోగా సాధన చేయడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని కోరారు. అయితే, ఉబ్బసం, గుండె జబ్బులు, మధుమేహంతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలని, కాబట్టి వారు సహజ జీవనశైలిని అనుసరించాలని కోరుతున్నట్టు చెప్పారు.