1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 14 మార్చి 2020 (15:32 IST)

పాతాళానికి చికెన్ ధరలు .. ఆ పండు ధరకు రెక్కలు

కరోనా వైరస్ దెబ్బకు అన్ని రంగాలు కుదేలైపోతున్నాయి. ఇప్పటికే పౌల్ట్రీ రంగం పూర్తిగా దెబ్బతింది. చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందన్న దుష్ప్రచారంతో పాటు... బర్డ్ ఫ్లూ దెబ్బకు చికెన్ ధరలు పూర్తిగా పడిపోయాయి. పలు ప్రాంతాల్లో ఉచితంగా పంపిణీ చేస్తుంటే.. మెట్రో నగరాల్లో మాత్రం కేజీ చికెన్ 30 నుంచి రూ.40కి విక్రయిస్తున్నారు. అలాగే, మటన్ ధరలు కూడా కొంతమేరకు తగ్గాయి. 
 
దీంతో మాంసాహార, బిర్యానీ ప్రియులు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు. చికెన్, మటన్ బిర్యాలను పుష్టిగా ఆరగించేవారు.. ఇపుడు వాటికి దూరంగా ఉంటూ పనస పండును లాగించేస్తున్నారు. ఫలితంగా నిన్నామొన్నటి వరకు రూ.50 పలికిన పనసపండు ఇపుడు ఏకంగా రూ.120 నుంచి రూ.150 వరకు పలుకుతోంది. 
 
దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి వేగవంతం అవుతోన్న నేపథ్యంలో.. చికెన్, మటన్‌ల బదులు జాక్ ఫ్రూట్(పనస) తినడం మంచిదని కొందరు చెబుతున్నారు. కాగా మాంసాహారం తింటే కరోనా వ్యాప్తి చెందదని డాక్టర్లు చెబుతున్నా.. ప్రజల్లో మాత్రం అనుమానం వీడటం లేదు. దీంతో చికెన్, మటన్ రేట్లు భారీగా పడిపోయాయి.