శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 మే 2021 (08:41 IST)

ఓట్ల లెక్కింపు : బెంగాల్‌లో దీదీ - తమిళనాడులో స్టాలిన్‌దే ఆధిక్యం

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. ఎవరు గెలుస్తారన్న దానిపై ఆయా రాష్ట్రాల ప్రజలతో పాటు దేశమంతటా ఉత్కంఠ నెలకొంది. 
 
ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ కౌంటింగ్ చేపట్టారు. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ గెలుస్తుందని మెజారిటీ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ సర్వేలో తెలిపాయి. కొన్ని మాత్రం బీజేపీ వైపు మొగ్గుచూపాయి. తమిళనాడులో డీఎంకే, కేరళ ఎల్డీఎఫ్, అసోం, పుదుచ్చేరిలో బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో తేలింది.  
 
అయితే, ఓట్ల లెక్కింపు ప్రారంభం ట్రెండింగ్స్‌లో భాగంగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 292 స్థానాలకు గాను 102 స్థానాల్లో ఆధిపత్యం వెల్లడైంది. ఇందులో 53 చోట్ల టీఎంసీ, 49 చోట్ల బీజేపీ ఆధిక్యంలో వుంది.
 
అలాగే, తమిళనాడులో 234 స్థానాలకు గాను 15 చోట్ల డీఎంకే, 7 చోట్ల అన్నాడీంకే ఆధిక్యంలో వుంది. అస్సాంలో 126 సీట్లకు గాను బీజేపీ 12, కాంగ్రెస్ 9, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. కేరళ రాష్ట్రంలో 140 సీట్లకుగాను 35 చోట్ల యూడీఎఫ్, కాంగ్రెస్ 34, ఇతరులు 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. పుదుచ్చేరిలో 30 స్థానాలకు గాను 5 చోట్ల ఎన్ఆర్ కాంగ్రెస్, 4 చోట్ల కాంగ్రెస్ అధిక్యంలో వుంది. 
 
5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా… పశ్చిమ బెంగాల్‌లో 1,113 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. అలాగే… కేరళలో 633, అసోంలో 331, తమిళనాడులో 256, పుదుచ్చేరిలో 31 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటుచేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.