గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

బఠిండాలో మళ్లీ కాల్పుల మోత.. జవాను మృతి

bathinda military station
పంజాబ్ రాష్ట్రంలోని బఠిండాలోని సైనిక స్థావరంలో మళ్లీ కాల్పుల శబ్దం వినిపించింది. ఈ కాల్పులు జరిగిన కొన్ని గంటల్లోనే మరో జవాను ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం సాయంత్రం ఓ జవాను బుల్లెట్‌ గాయంతో మృతిచెందినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. అయితే, తాజా ఘటనకు అంతకుముందు జరిగిన కాల్పులతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.
 
అయితే, ఈ జవాను ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా ఏదైనా ప్రమాదం జరిగిందా? అన్నదానిపై స్పష్టత లేదు. ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడంతో అతడు మరణించి ఉంటాడని ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు. మృతుడిని లఘు రాజ్‌ శంకర్‌గా గుర్తించారు.
 
కాగా, బఠిండా సైనిక స్థావరంలో బుధవారం తెల్లవారుజామున కాల్పులు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆగంతకులు జరిపిన దాడిలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల శబ్దం వినిపించగానే సత్వర ప్రతిస్పందన బృందాలు అప్రమత్తమై ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకొని గాలింపు చేపట్టాయి. 
 
దుండగులు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. వారి కోసం వేట కొనసాగుతోంది. కుర్తా పైజామా ధరించి, ముఖానికి మాస్కులతో వచ్చిన దుండగులు ఈ కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే మరో జవాను బుల్లెట్‌ గాయంతో మరణించడం గమనార్హం.