ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 మార్చి 2021 (22:23 IST)

వాట్సప్‌కు పంపిన ఫోటోల్లో చూసినట్లు లేడు.. పెళ్ళి ఆపేసిన వధువు.. ఎక్కడ?

ఎన్నో పెళ్ళిళ్లు పీటల వరకు వచ్చి ఆగిపోయిన దాఖలాలున్నాయి. తాజాగా బీహార్‌లో ఫోటోలో చూసినట్లుగా వరుడు లేడని వధువు పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయింది. అతడిని పెళ్లి చేసుకునేదే లేదని స్పష్టం చేసింది. ఇరు కుటుంబ సభ్యులు ఎంత నచ్చజెప్పినప్పటికి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చేసేది లేక ఆ పెళ్లి కొడుకు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో జరిగింది.
 
వివరాల్లోకి వెళితే..పశ్చిమ చంపారన్ జిల్లా బైరియాలోని తదీవానందపుర్‌కు చెందిన ఓ యువతికి మరో గ్రామానికి చెందిన అనిల్ కుమార్‌తో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. వాట్సాప్‌లో పంపిన అనిల్‌కుమార్‌ ఫోటోలు చూసిన ఆ యువతికి పెళ్లికి ఒప్పుకుంది. దీంతో ఇరు కుటుంబాలు పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వరుడు అనిల్.. కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో కలిసి ధూం ధాంగా కల్యాణ మండపానికి చేరుకున్నాడు. పెళ్లి పీటలపై కూర్చున్నాడు. అంత వరకు బాగానే ఉంది. ఇప్పుడే అసలు ట్విస్ట్ ఇచ్చింది పెళ్లి కూతురు.
 
సరిగ్గా తాళి కట్టబోయే ముందు వరుడిని చూసిన వధువు.. వెంటనే పెళ్లి వద్దు అని అరుస్తూ చెప్పింది. పెళ్లి కొడుకు ఫోటోలో చూసినట్లుగా లేడని చెప్పింది. పెళ్లికి వచ్చిన వారితో పాటు పెద్దలు ఎంత నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా.. వధువు పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి వరుడు పెళ్లి చేసుకోకుండా పెళ్లి మండపం నుంచి వెనుదిరగాల్సి వచ్చింది.