గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (08:24 IST)

కరోనాతో అశోక్ గస్తీ కన్నుమూత.. ధృవీకరించిన ఆస్పత్రి

కర్ణాటకకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తీ (55) కరోనాతో కన్నుమూశారు. ఈ మేరకు ఆస్పత్రి యాజమాన్యం ధృవీకరించింది.  గతరాత్రి ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ మనీష్ రాయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. అశోక్ గస్తీ రాత్రి 10.31 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్టు వెల్లడించారు. 
 
నిజానికి కరోనా బారినపడి బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన చనిపోయినట్టు తొలుత వార్తలు వచ్చాయి. దీంతో పలువురు రాజకీయ నాయకులు ఆయన మృతికి సంతాపం తెలపుతూ ట్వీట్లు చేశారు. దీంతో స్పందించిన ఆసుపత్రి యాజమాన్యం ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. 
 
ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఐసీయూలో లైఫ్ సపోర్ట్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్టు పేర్కొంది. దీంతో అశోక్ గస్తీ మృతి విషయంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. అయితే, గతరాత్రి ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ మనీష్ రాయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. అశోక్ గస్తీ రాత్రి 10.31 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్టు వెల్లడించారు.  
 
అశోక్ గస్తీ ఆసుపత్రిలో చేరినప్పుడు తీవ్ర న్యూమోనియాతో బాధపడుతున్నారని, అలాగే, ఆయన శరీరంలోని చాలా భాగాలు పనిచేయడం మానేశాయని పేర్కొన్నారు. ఐసీయూలో లైఫ్ సపోర్ట్‌పై ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయిందని పేర్కొన్నారు.
 
అశోక్ గస్తీ ఉత్తర కర్ణాటకలోని రాయచూర్‌కు చెందినవారు. బూత్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. గస్తీ అంకితభావం కలిగిన కార్యకర్త అని పేర్కొన్న ప్రధాని నరేంద్ర మోడీ.. అశోక్ గస్తీ మృతిపట్ల సంతాపం తెలిపారు.