మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (07:20 IST)

బీజేపీ ఎంపీ చనిపోలేదట... వైద్యులు :: ఆస్పత్రి నుంచి షా డిశ్చార్జ్

కర్నాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తీ చనిపోయినట్టు మీడియాలో వచ్చిన వార్తలను వైద్యులు ఖండించారు. అశోక్ గస్తీ చనిపోలేదనీ చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని చెప్పుకొచ్చారు. 
 
గురువారం అశోక్ గస్తీ కరోనాతో పోరాడుతూ బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో మృతి చెందారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో మణిపాల్ ఆసుపత్రి డాక్టర్ సుదర్శన్ భల్లాల్ స్పందించారు. 
 
అశోక్ గస్తీ చనిపోయారనే వార్తల్లో నిజం లేదన్నారు. ప్రస్తుతం ఆయన తీవ్ర అనారోగ్యంతోనే ఉన్నారని... ఐసీయూలో లైఫ్ సపోర్ట్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. అశోక్ గస్తీ ఇటీవలే కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన ఎంపీ కావడం ఇదే తొలిసారి.
 
మరోవైపు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా సోకడంతో మేదాంత ఆసుపత్రిలో ఆగస్టు 2వ తేదీన అమిత్ షా చేరారు. ఆ తర్వాత ఆయన కోలుకున్నారు. ఆగస్టు 14న డిశ్చార్జ్ అయ్యారు. 
 
అయితే డిశ్చార్జ్ అయిన తర్వాత శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తడంతో ఈ నెల 13న మళ్లీ ఆసుపత్రిలో చేరారు. నాలుగు రోజుల చికిత్స తర్వాత గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వర్గాలు స్పందిస్తూ, అమిత్ షా ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని తెలిపారు.