శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (13:57 IST)

కరోనా నియంత్రించే మందు అని నమ్మించి.. తల్లిదండ్రులకు విషమిచ్చిన వ్యాపారి..

కరోనా వైరస్ కోట్లాది మంది జీవితాలను తారుమారుచేసింది. కరోనాకు ముందు సాఫీగా సాగిపోతూ వచ్చిన జీవనం ఈ వైరస్ నియంత్రణ కోసం విధించిన లాక్డౌన్ కారణంగా తలకిందులైపోయాయి. గత ఆర్నెల్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మున్ముందు కూడా కోలుకునే సూచనలు దరిదాపుల్లో ఎక్కడా కనిపించడం లేదు. దీంతో అనేక మంది కరోనా కష్టాల్లో కుటుంబ భారం మోయలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. 
 
ఇంకొందరు చిరు వ్యాపారులు కరోనా కారణంగా వ్యాపారంలో వచ్చిన నష్టాలను భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో ఓ యువ వ్యాపారస్తుడు కరోనా కారణంగా వ్యాపారంలో నష్టం రావడంతో తట్టుకోలేక తన తల్లిదండ్రులకు విషమిచ్చి.. తాను కూడా విషం సేవించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఏ.అనీశ్‌ రెడ్డి (33). ఐటీ, కార్పొరేట్‌ కంపెనీలకు వంటకాలను సిద్ధం చేసి పంపించే వ్యాపారం చేస్తున్నాడు. కరోనా కారణంగా వ్యాపారం దెబ్బతినడంతో అనీశ్‌కు సమస్యలు చుట్టుముట్టాయి. బుధవారం సాయంత్రం బయట నుంచి ఇంటికొచ్చాడు. 
 
ఇంట్లోకి విషం తెచ్చి.. కరోనా వైరస్‌ రాకుండా చేసే మందు అని నమ్మించి తాను తాగాడు. తాగండని తల్లిదండ్రులకు ఇచ్చాడు. తండ్రి తాగాడు. ఇంటి పనిలో పడి దాన్ని తాగడాన్ని తల్లి మరిచిపోయింది. 
 
కొద్దిసేపటికి భర్త, కొడుకు తీవ్ర అస్వస్థతకు గురవడంతో వారిని ఆమె ఆస్పత్రికి తరలించింది. అనీశ్‌ అప్పటికే మృతిచెందాడు. రామిరెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. ఘటనపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.