మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 సెప్టెంబరు 2020 (14:37 IST)

తెలంగాణాలో వెయ్యి దాటిన మరణాలు - భారత్‌కు 10 కోట్ల డోసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌కు చనిపోయిన వారి సంఖ్య వెయ్యికి దాటింది. తాజాగా మరో 2159 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుంటే మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,65,003కి చేరిందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది.
 
కాగా, కొత్తగా 2180 మంది వైరస్‌ నుంచి కోలుకోగా, ఇప్పటివరకు 1,33,55 మంది ఇళ్ళకు చేరుకున్నారు. తాజాగా మరో 9 మంది మృతి చెందగా, మొత్తం 1,005 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,443 యాక్టివ్‌ కేసులున్నాయని, మరో 23,674 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ చెప్పింది. 
 
కాగా, రాష్ట్రంలో 0.60 శాతం మరణాల రేటు ఉండగా, రికవరీ రేటు 80.94 శాతంగా ఉందని, ఇది దేశ సగటు (78.59శాతం) కంటే ఎక్కువని పేర్కొంది. బుధవారం ఒకే రోజు 53,094 శాంపిల్స్‌ పరీక్షించగా, 1032 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని, ఇప్పటికీ మొత్తం 23,29,316 టెస్టులు చేసినట్లు వివరించింది. 
 
భారత్‌కు 10 కోట్లు డోసులు 
హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరేటరీస్‌కు 'స్పుత్నిక్‌ వి' కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ 10 కోట్ల మోతాదు (డోసు)లను రష్యా సరఫరా చేయనున్నది. 'భారత్‌లో స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ పంపిణీ, ప్రయోగశాల పరీక్షలపై సహకారానికి రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్డీఐఎఫ్‌), డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరేటరీస్‌ అంగీకరించాయి' అని ఇరు సంస్థలు బుధవారం ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. 
 
క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతగా పూర్తయితే భారత రెగ్యులేటరీ అనుమతులతో ఈ యేడాది ఆఖర్లో వ్యాక్సిన్‌ అమ్మకాలు మొదలు పెట్టగలమన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా ఆయా సంస్థలు వ్యక్తం చేశాయి. అయితే ఈ ఒప్పందం విలువ తదితర ఆర్థిక వివరాలేవీ సదరు ప్రకటనలో రెడ్డీస్‌, ఆర్డీఐఎఫ్‌ పేర్కొనలేదు.