మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 సెప్టెంబరు 2020 (17:02 IST)

బోర్డర్‌కు బోఫోర్స్ శతఘ్నులు తరలిస్తున్న భారత్!

భారత్ - చైనా దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. దీంతో ఇరు దేశాలు భారీ సంఖ్యలో సైనిక బలగాలతో పాటు ఆయుధాలను తరలిస్తున్నాయి. ఇందులోభాగంగా, భారత్ చైనా సరిహద్దులకు శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించే బోఫోర్స్ శతఘ్నులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 
 
చైనాతో ఘర్షణలు తలెత్తిన పక్షంలో ఏ క్షణంలోనైనా లడఖ్‌లో ఈ 155 ఎంఎం బోఫోర్స్‌ గన్‌లను రంగంలోకి దింపేందుకు చురుకుగా సన్నాహకాలు జరుగుతున్నాయి. లడఖ్‌లోని బోఫోర్స్ గన్స్ మెయింటెనెన్స్ ఫెసిలిటీస్‌లో సర్వీసింగ్, మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. 
 
బోఫోర్స్ శతఘ్నులను ఆర్టిలరీ రెజిమెంట్‌లో 1980వ దశకం మధ్యలో ప్రవేశపెట్టారు. అరివీర భయంకరంగా భూతలం, వాయుతలంపై కాల్పులతో మోతమోగించే సామర్థ్యం ఈ బోఫోర్స్ శతఘ్నులకు ఉంది. 
 
ప్రస్తుతం వీటి సర్వీసింగ్ పూర్తికాగానే లడఖ్‌‌లో మోహరించనున్నట్టు తెలుస్తోంది. బోఫోర్స్ శతఘ్నిని సర్వీసు చేస్తున్న ఆర్మీ ఇంజనీర్ ఒకరు దీనిపై మాట్లాడుతూ, కొద్దిరోజుల్లోనే బోఫోర్స్ గర్జించేందుకు సిద్ధమవుతుందని చెప్పారు.
 
అధికారుల కథనం ప్రకారం, బోఫోర్స్ శతఘ్నులకు పీరియాడికల్ సర్వీస్, మెయింటెన్స్ జరుగుతుండాలి. ఇందుకోసం టెక్నీషియన్లు ఉంటారు. ఈ ఆయుధ సామగ్రి సర్వీస్, మెయింటెనెన్స్ ‌వంటివి చూసుకోవడం ఆర్మీ ఇంజనీర్ల బాధ్యత. ఇటీవల జమ్మూకాశ్మీర్‌లోని డ్రాస్‌లో జరిగిన ఆపరేషన్ విజయ్ సహా పలు యుద్ధాల్లో విజయానికి బోఫోర్స్ కీలక భూమిక వహించింది. 
 
పాకిస్థాన్‌పై 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో బోఫోర్స్ శతఘ్నులు పాక్ బలగాలను మట్టికరిపించాయి. ఎత్తైన కొండ ప్రాంతాల్లో పాక్ ఏర్పాటు చేసిన బంకర్లు, స్థావరాలను శతఘ్నులు సర్వనాశనం చేశాయి. పాక్‌కు భారీ నష్టాన్ని కలిగించి, భారత్ విజయాన్ని సుగమం చేశాయి.