సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 23 ఏప్రియల్ 2017 (13:50 IST)

దినకరన్ అరెస్టు ఖాయమా? ఎన్నికల కమిషన్‌కు రూ.50 కోట్ల ఎరపై విచారణ

అన్నాడీఎంకే అమ్మ పార్టీ నేత టీటీవీ దినకరన్‌ అరెస్టు ఖాయమని తెలుస్తోంది. రెండాకుల గుర్తు కోసం ఎన్నికల సంఘానికి రూ.50 కోట్ల లంచం ఇవ్వజూపిన కేసులో ఆయనను ఢిల్లీ పోలీసులు విచారణకు పిలిపించిన విషయం తెల్సింద

అన్నాడీఎంకే అమ్మ పార్టీ నేత టీటీవీ దినకరన్‌ అరెస్టు ఖాయమని తెలుస్తోంది. రెండాకుల గుర్తు కోసం ఎన్నికల సంఘానికి రూ.50 కోట్ల లంచం ఇవ్వజూపిన కేసులో ఆయనను ఢిల్లీ పోలీసులు విచారణకు పిలిపించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన వద్ద విచారణ కొనసాగుతోంది. 
 
రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల కమిషన్‌కు రూ.50 కోట్లు ఎరవేశారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీస్‌ సహాయ కమిషనర్‌ సంజయ్‌ షెరావత్, ఇన్స్‌పెక్టర్‌ నరేంద్ర షాకల్‌ నుంచి ఈనెల 19వ తేదీన దినకరన్‌కు స్వయంగా సమన్లు అందజేశారు. అప్పటికే బ్రోకర్‌ సుకేష్‌ చంద్రశేఖర్‌ను డిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేసి వాంగ్మూలం సేకరించినందున దినకరన్‌ను సైతం అరెస్ట్‌ చేస్తారని అందరూ భావించారు. 
 
అయితే సమన్లలో ఈనెల 22వ తేదీన డిల్లీలో పోలీసుల ముందు దినకరన్‌ హాజరుకావాలని ఉంది. దినకరన్‌పై తగిన ఆధారాలు ఉన్నందునే సమన్లు జారీచేశామని చెన్నైకి వచ్చిన డిల్లీ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. ఎన్నికల కమిషన్‌ను లోబరుచుకునేందుకు దినకరన్‌ ఏర్పాటు చేసుకున్న మధ్యవర్తి సుకేష్‌ చంద్రశేఖర్‌ నుంచి అనేక వివరాలు రాబట్టామని తెలిపారు. 
 
ఈనెల 22వ తేదీన ఢిల్లీలో జరిపే విచారణలో దినకరన్‌పై ఆరోపణలు రుజువైన పక్షంలో అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఈ విచారణ ముగిసిన తర్వాత ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే తమిళనాట వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.