శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 10 ఏప్రియల్ 2017 (01:03 IST)

ఆర్కే నగర్ ఉపఎన్నిక రద్దు: ఓటర్లకు డబ్బు పంపిణీపై ఈసీ కన్నెర్ర

మొత్తం మీద అనుకున్నదే జరిగింది. వందకోట్ల మేరకు ధనాన్ని ఓటర్లకు పంచారన్న ఆరోపణలపై విచారించిన కేంద్ర ఎన్నికల సంఘం తమిళనాడులోని ఆర్కేనగర్ శాసనసభ స్థానానికి ఏప్రిల్ 12న జరగాల్సిన ఉపఎన్నికలను రద్దు చేసింది.

మొత్తం మీద అనుకున్నదే జరిగింది. వందకోట్ల మేరకు ధనాన్ని ఓటర్లకు పంచారన్న ఆరోపణలపై విచారించిన కేంద్ర ఎన్నికల సంఘం తమిళనాడులోని ఆర్కేనగర్ శాసనసభ స్థానానికి  ఏప్రిల్ 12న జరగాల్సిన  ఉపఎన్నికలను రద్దు చేసింది. తమిళనాడు చరిత్రలో ఇదొక సంచలన ఘటన. తమిళనాట రాజకీయ అధికారాన్ని మెజారిటీ ప్రాతిపదికన నిలబెట్టుకున్న అన్నాడీఎంకే శశికళ వర్గం రాజకీయ మనుగడకోసం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆర్కేనగర్ ఉప ఎన్నికలు రద్దు కావడం శశికళ వర్గానికి పిడుగుపాటులా తగిలింది. ఉప ఎన్నిక కోసం రూ. 89 కోట్ల మేరకు ఓటర్లకు శశికళ వర్గం పంచిందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఆదివారం రాత్రి 1030 తర్వాత ఈసీ ఈ ఉప ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
 
మంత్రి విజయ భాస్కర్ వద్ద దొరికిన ఒక కీలక డాక్యుమెంట్ ఓటర్లను కొనుగోలు చేసే వ్యూహానికి సంబంధించిన నమూనా పత్రంగా ఈసీ గుర్తించింది. ఆర్కే నియోజక వర్గాన్ని 256 విభాగాలుగా విభజించి మొత్తం 2.6 లక్షల మంది ఓటర్లలో 85 శాతమంది ఓటర్లకు ఒక్కొక్కరికి రూ. 4 వేలచొప్పున పంచాలని రాసుకున్న ఆ నమూనా పత్రం ఈసీకి సరైన సాక్ష్యంలా దొరికింది. నియోజకవర్గంలోని 85 శాతం మంది ఓటర్లలో ఒక్కొక్కరికి 4 వేల చొప్పున పంచితే మొత్తం రూ. 89 కోట్లు అవుతుందని అంచనా. 
 
పైగా ముఖ్యమంత్రి ఇ. పళనిస్వామి, అటవీ మంత్రి దిండిగల్ శ్రీనివాసన్, ఆర్థిక మంత్రి జయకుమార్తో పాటు ఏడుగురు అధికార పార్టీకి చెందిన నేతలు ఉపఎన్నిక గెలుపుకు సంబంధించిన లక్ష్యాన్ని రూపొందించుకున్నట్లు మంత్రి విజయభాస్కర్ వద్ద ఈసీ చేజిక్కించుకున్న ఫత్రం తెలిపింది. ముఖ్యమంత్రే స్వయంగా 33 వేలమంది ఓటర్లకు 13. 27 కోట్ల రూపాయలను పంపిణీ చేయాలన్న లక్ష్యాన్ని తనపై విధించుకున్నారు.
 
ఆర్కే ఉప ఎన్నిక సందర్భంగా ఆ నియోజకవర్గంలో విచ్చలవిడిగా సాగుతోన్న ధనప్రవాహంపై  ఐటీ శాఖ ఎన్నికల సంఘానికి ఒక రిపోర్టు పంపింది. సమగ్ర పరిశీలన అనంతరం ఈసీ ఉప ఎన్నికను రద్దుచేస్తున్నట్లు నిర్ణయాన్ని ప్రకటించింది. తాజాగా ఆర్కే నగర్‌లో చోటుచేసుకున్నట్లే గత ఏడాది తంజావురు, అరవకురిచి నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ విచ్చలవిడి ధనప్రవాహాన్ని గుర్తించిన ఈసీ.. ఆయా ఎన్నికలను వాయిదావేసిన సంగతి తెలిసిందే.
 
తీవ్ర అనారోగ్యంతో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనూహ్యం మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్‌ స్థానానికి ఏప్రిల్‌ 12న ఉప ఎన్నిక జరగాల్సిఉంది. అయితే అధికార పార్టీ నేతలు ఇప్పటికే ఓటర్లను ప్రభావితం చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బులు పంచినట్లు బట్టబయలైంది. ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో ఈ పంపకాల వ్యవహారం గుట్టురట్టైంది. 
 
తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌, నటుడు శరత్‌ కుమార్‌, మరి కొందరికి చెందిన 32 ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుపగా రూ.90 కోట్ల వరకూ ఓటర్లకు సరఫరా చేసినట్లు వెల్లడైంది. దీంతో ఇంకా వెలుగులోకిరాని పంపకాలు భారీ స్థాయిలోనే జరిగి ఉంటాయని ఐటీ శాఖ భావించింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఇలా ససాక్ష్యంగా ఓటర్లకు డబ్బు పంచుతున్నట్లు బట్టబయలు కావడం సంచలనం కొలుపుతోంది.