గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 జూన్ 2021 (17:45 IST)

పర్యాటకులకు శుభవార్త చెప్పిన కేంద్రం : జూన్ 16 నుంచి అనుమతి

కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పర్యాటక ప్రాంతాల సందర్శనకు పర్యాటకులకు అనుమతి ఇవ్వనుంది. ఈ నెల 16వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పర్యాటక ప్రాంతాల సందర్శనకు ఓకే చెప్పింది. 
 
గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో పర్యాటకులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లాక్‌డౌన్ నుంచి మరిన్ని సడలింపులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ఇందులోభాగంగా, తాజ్‌మహల్ సహా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్మారక కేంద్రాలను తెరుస్తామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. జూలై 6 నుంచి అన్ని స్మారక కేంద్రాల్లోకి పర్యాటకులను అనుమతిస్తామని వెల్లడించారు. 
 
అయితే, పర్యాటకులు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ముఖానికి మాస్క్‌ను ధరించడంతో పాటు రెండడుగుల భౌతిక దూరాన్ని పాటించాలి. పర్యాటకుల సందర్శనకు సంబంధించి కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ప్రహ్లాద్ సింగ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
 
దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌‌లో భాగంగా భారీగా కేసులు పెరగడంతో అప్రమత్తమైన కేంద్రం.. స్మారక కట్టడాలు, స్థలాలు, మ్యూజియాలను ఏప్రిల్‌ 15నుంచి మూసివేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. 
 
అదేసమయంలో అనేక రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్‌లను సడలిస్తూ సాధారణ జీవనానికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నాయి. మరోవైపు, వ్యాక్సినేషన్‌ కూడా కొనసాగుతోంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జూన్‌ 16 ఈ బుధవారం నుంచి కేంద్ర సంరక్షణలో ఉన్న చారిత్రక కట్టడాలు, ప్రదేశాలను తిరిగి తెరవాలని నిర్ణయించారు.