ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు ప్రారంభం.. కేసీఆర్ అనుమతితో..?
కరోనాతో మూతపడిన విద్యా సంస్థలను క్రమంగా తెరిచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతితో... తొమ్మిది నుంచి ఆపై తరగతులను ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. కరోనా జాగ్రత్తలతో విద్యా సంస్థలు తెరిచేందుకు పాఠశాల విద్యాశాఖ, ఇంటర్ బోర్డు, కళాశాల, సాంకేతిక విద్యాశాఖలు, విశ్వవిద్యాలయాలు కసరత్తు చేస్తున్నాయి.
జూనియర్ కళాశాలలు షిఫ్టు పద్ధతిలో... డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ ఇతర వృత్తి విద్య కాలేజీలు రోజుకు సగం మంది విద్యార్థులతో ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రత్యక్ష తరగతుల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకపోతే... పదిహేను రోజుల తర్వాత ఆరు, ఏడు, ఎనిమిదో తరగతులు కూడా మొదలు పెట్టాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.
ఆరు నుంచి ఎనిమిది తరగతులకు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభించేలా ప్రభుత్వానికి పాఠశాల విద్యా శాఖ ప్రతిపాదనలు పంపించింది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు డిటెన్షన్ ఉండదని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.