గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 డిశెంబరు 2020 (09:59 IST)

కరోనా ఎఫెక్టు : ఈ యేడాదికి పాఠశాలలు లేనట్టే!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ యేడాదికి పాఠశాలలు తెరవకూడదని భావిస్తోంది. ముఖ్యంగా, ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఈ విద్యా సంవత్సరం వరకు బడులు తెరవకూడదని నిర్ణయించినట్టు వార్తలు వస్తాయి. దీనికి బలమైన కారణం లేకపోలేదు. 
 
కరోనా వైరస్ కారణంగా మూతపడిన స్కూళ్లు తెరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కానీ, పరిస్థితులు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. రాష్ట్రంలో వందల సంఖ్యలో ఈ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో పాఠశాలలు తెరిచినా తమ పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు తల్లిదండ్రులు అంగీకరించకపోవచ్చని సర్కారు భావించింది. 
 
అందుకే ప్రభుత్వం ఒకటి నుంచి 5 తరగతులకు స్కూళ్లు తెరవకూడదని నిర్ణయించింది. ప్రైవేటు స్కూళ్లను కూడా ఇందుకు అనుమతించరాదని యోచిస్తోంది. పాఠశాలలు కనుక ప్రారంభిస్తే పిల్లలు భౌతిక దూరం పాటించడం అసాధ్యమని, పిల్లలు కనుక వైరస్ బారినపడితే ఇంట్లోని పెద్దలకు కూడా అది సంక్రమించే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. కాబట్టి ఐదో తరగతి వరకు ఈ విద్యాసంవత్సరంలో బడులు ప్రారంభించకపోవడమే మంచిదని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
 
కాగా, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒకటి నుంచి ఐదు తరగతులు చదువుతున్న విద్యార్థుల సంఖ్య సుమారు 26 లక్షల వరకు ఉంది. ఇందులో ప్రభుత్వ స్కూళ్లలో 11.36 లక్షల మంది ఉండగా, ప్రైవేటు పాఠశాలల్లో ఈ సంఖ్య 15 లక్షల వరకు ఉందని అంచనా. ఇక, నర్సరీ-యూకేజీ మధ్య చదువుతున్న వారు ఆరేడు లక్షల మంది వరకు ఉంటారు. 
 
వీరందరినీ పై తరగతులకు ప్రమోట్ చేయాలని అధికారులు నిర్ణయించారు. 6 నుంచి 8 తరగతులకు పరిస్థితులను బట్టి ప్రత్యక్ష బోధనపై నిర్ణయం తీసుకుంటారు. 9 - 10 తరగతుల విద్యార్థులకు మాత్రం కనీసం 90 రోజులు, గరిష్టంగా 120 రోజులపాటు ప్రత్యక్ష బోధన అందించాలని భావిస్తున్నారు. మొత్తంమీద కరోనా మహమ్మారి విద్యార్థుల విద్యాబోధనపై తీవ్ర ప్రభావం చూపింది.