1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 18 సెప్టెంబరు 2019 (16:01 IST)

'కమలం' చెంతకు చిన్నమ్మ నమ్మినబంటు... జైలు నుంచి శశికళకు విముక్తి?

తమిళనాటపాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ చేయని ప్రయత్నమంటూ లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్‌ను తమ వైపునకు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు బీజేపీ జాతీయ చీఫ్ అమిత్ షాలు ఇప్పటికే రజినీతో టచ్‌లో ఉన్నారు. మరోవైపు, ఇతర పార్టీల్లోని కీలక నేతలకు గాలం వేసే పనిలో కమలనాథులు ఉన్నారు. 
 
ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితతో పాటు చిన్నమ్మగా పేరుగాంచిన శశికళకు నమ్మినబంటుగా పేరొందిన పుగళేంది కమలం వైపు ఆకర్షితులైనట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈయన అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఈ పార్టీని శశికళ బంధువు, చెన్నై ఆర్కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ స్థాపించిన విషయం తెల్సిందే. 
 
మంచి వ్యాఖ్యాతగా ఉన్న ఆయన్ను తమ వైపునకు తిప్పుకుంటే ఉపయోగపడుతాడనే భావనతో కమలనాథులు ఆహ్వానం పలికినట్టు తెలుస్తోంది. అయితే.. చిన్నమ్మ శశికళతో సాగే భేటీ మేరకు తదుపరి తన నిర్ణయాన్ని ప్రకటించాలని సంకల్పించి ఉన్నా, కమలనాథుల ఆహ్వానంపై కృతజ్ఞతలు తెలిపే విధంగా పుగళేంది స్పందించడం గమనార్హం. 
 
ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుత, చిన్నమ్మ శశికళ త్వరలోనే జైలు నుంచి విడుదలకానున్నారనీ, ఆమె రాకతో అన్నీ సర్దుకుంటాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అన్నాడీఎంకే మంత్రివర్గంలో ఒక్క మంత్రి డి.జయకుమార్‌ మినహా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు మిగిలిన మంత్రులు ఎవరూ కూడా శశికళకు వ్యతిరేకంగా స్పందించిన దాఖలాలు లేవని గుర్తుచేశారు. 
 
అందువల్ల ఆమె బయటకు వస్తే, పరిస్థితులు అన్నీ మారుతాయని, ఆమె త్వరలో వస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ నుంచి తనకు ఆహ్వానం పలికినట్టుగా మీడియాల్లో వార్తలు చూశానని, అలా జరిగివుంటే.. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు తెలిపారు. చిన్నమ్మ రాకతో అందరూ ఆమె చుట్టు చేరుతారని, ఇది జరిగి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.