ఆదివారం, 3 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 నవంబరు 2022 (09:51 IST)

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్‌కౌంటర్ - ఆరుగురు మావోల మృతి

maoists
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. పోమ్రా - హల్లూర్ అటవీ ప్రాంతంలో 40 మంది మావోయిస్టులు సమావేశమైనట్టు వచ్చిన పక్కా సమాచారంతో గ్రేహౌండ్స్ బలగాలు స్థానిక పోలీసులతో కలిసి కూంబింగ్ చేపట్టాయి. ఆ సమయంలో ఒకరినొకరు ఎదురుపడటంతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 
 
రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా మిర్తూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోమ్రా - హల్లూరు అటవీ ప్రాంతంలో బీజాపూర్ డివిజన్ కమిటీ సభ్యుడు సారథ్యంలో దాదాపు 40 మంది మావోయిస్టులు సమావేశమయ్యారు. దీంతో సెంట్రల్ రిజర్వు ఫోర్స్, జిల్లా రిజర్వు బలగాలు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ బలగాలు సంయుక్తంగా ఆ ప్రాంతానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. 
 
ఈ క్రమంలో ఇరు వర్గాలు తారసపడటంతో వారి మధ్య ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. బలగాలు నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. రెండు మృతదేహాలను మావోయిస్టులు తమ వెంట తీసుకెళ్లారు. ఈ ఎన్‌‍కౌంటరులో మరో ముగ్గురు మావోయిస్టులు గాయపడ్డారు.
 
ఈ ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో 303, 3015 రైఫిళ్ళతో పాటు ఇతర ఆయుధాలను, మందుపాతర సామాగ్రిని స్వాధీన చేసుకున్నారు. డిసెంబరు 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పీపుల్స్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాల నిర్వహణ కోసం ఏర్పాట్లలో భాగంగానే మావోయిస్టులు అక్కడ సమావేశమైనట్టు తెలుస్తుంది.