బీహార్‌కు వరాలు జల్లు సరే... ఏపీని ఎందుకు విస్మరించారు : జైరాం రమేష్
వచ్చే యేడాది ఎన్నికలు జరుగనున్న బీహార్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్‌లో వరాల జల్లు కురిపించింది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ స్వాగతింస్తూనే, ఎన్డీయే ప్రభుత్వానికి మూలస్తంభంలా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎందుకు విస్మరించారంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇదే అంశంపై ఆయన ట్వీట్ చేస్తూ, 'బీహార్‌లో ప్రకటనల బొనాంజా వచ్చినట్లు కనిపిస్తోంది. ఏడాది తర్వాత అక్కడ ఎన్నికలు జరగనున్నాయి కనుక ఇది సహజం. అయితే ఎన్‌డిఎలోని మరో మూలస్థంభమైన ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు ఇంత దారుణంగా విస్మరించారు?' అని ప్రశ్నించారు.
మరోవైపు, దేశంలో కొత్తగా ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని తీసుకొస్తున్నట్లు నిర్మలాసీతారామన్ ప్రకటించారు. దీని ద్వారా దేశంలో వెనుకబడిన వంద జిల్లాల్లో వ్యవసాయ రంగ ప్రోత్సాహానికి ఉపయోగపడుతుందని చెప్పారు. కోటి 70 లక్షల మంది గ్రామీణ రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. దేశంలో 10 విస్తృత రంగాలపై కేంద్రం దృష్టి సారిస్తుందన్నారు. వీటి ద్వారా వ్యవసాయ వృద్ధితోపాటు ఉత్పదకత పెరుగుతుందని తెలిపారు.
వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పెట్టుబడులు, ఎగుమతి రంగాలను పవర్‌ఫుల్ ఇంజిన్లు అన విత్తమంత్రి అభివర్ణించారు. వీటి ద్వారా వికసిత్ భారత్‌ను సాధిస్తామన్నారు. ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ కోసం జాతీయ మిషన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఎడిబుల్ ఆయిల్స్, పప్పులు ద్వారా స్వయం సమృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఆమె వెల్లడించారు.
కాగా.. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్‌కు కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు ప్రకటించింది. కేంద్ర బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేశారు. బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తామని విత్తమంత్రి ప్రకటించారు. దీనిద్వారా.. బీహార్ రైతులకు భారీగా లబ్ది చేకూరనుంది. కొత్తగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. మేకిన్ ఇండియా కోసం జాతీయ స్థాయి ప్రణాళిక చేపట్టామని.. ఐఐటీ పాట్నాను విస్తరిస్తామని తెలిపారు. బిహార్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల నిర్మాణం.. ఇందులో భాగంగా పాట్నా ఎయిర్‌పోర్టు విస్తరణ.. వెస్టర్న్ కోసి ప్రాజెక్టుకు మంజూరు.. బిహార్ మిథిలాంచల్ ప్రాంతంలో కొత్తగా రేవు ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.