ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 ఏప్రియల్ 2020 (16:38 IST)

యూపీ సీఎం సంచలన నిర్ణయం ... 15 జిల్లాల్లో సంపూర్ణ లాక్‌డౌన్

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో 15 జిల్లాలను పూర్తిగా మూసివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం ఏప్రిల్ 13వ తేదీ అర్థరాత్రి నుంచి అమల్లోకి రానుందని చెప్పారు. 
 
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 326 కేసుల నమోదయ్యాయి. ఇందులో 166 కేసులు మర్కజ్‌తో లింక్ కావడంతో యోగి ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. రోజు రోజు ఈ కేసులు పెరిగిపోవడంతో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు అర్థరాత్రి నుంచి ఏప్రిల్ 13 వ తేదీ వరకు 15 జిల్లాలను పూర్తిగా మూసేస్తున్నట్టు ప్రకటించారు. 
 
దీంతో ఈ నెల 13వ తేదీ అర్థరాత్రి నుంచి లక్నో, ఆగ్రా, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా), కాన్పూర్, వారణాసి, షమ్లి, మీరట్, బరేలి, బులంద్ షేర్, ఫిరోజాబాద్, మహారాజ్ గంజ్, సీతాపూర్, షహరన్ పూర్, బస్తి జిల్లాల్లో ఈ సంపూర్ణ లాక్‌డౌన్ అమల్లోకి వెళ్లనున్నాయి. ఈ జిల్లాల్లో ప్రజలకు అవసరమైన అన్ని రకాల నిత్యావసర వస్తువులను ప్రభుత్వం ఇంటింటికీ సరఫరా చేసేలే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 
 
కాగా, బుధవారం నాటికి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 326కు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 37 జిల్లాల నుంచి కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల్లో 166 తబ్లీగి జమాత్‌తో లింక్ ఉన్నవే కావడం గమనార్హం. యూపీ నుంచి 1600 మంది తబ్లీగి జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నట్టు గుర్తించిన ప్రభుత్వం 1200 మందిని క్వారంటైన్ చేసింది. కాగా, రాష్ట్రంలో కరోనా కారణంగా ఇప్పటి వరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.