సీఎం యడ్యూరప్ప కుమార్తెకు కరోనా పాజిటివ్.. ఒకే ఆస్పత్రిలో చికిత్స
పేద ధనిక తేడా లేకుండా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో ఓ వైపు కేసులు పెరిగిపోతుంటే.. మరోవైపు కోవిడ్ ప్రముఖులపై పంజా విసురుతోంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్(80), ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కరోనా బారిన పడగా.. యూపీ సాంకేతిక విద్యా శాఖ మంత్రి కమల్‌రాణి (62) కోవిడ్‌తో మరణించిన విషయం విదితమే.
తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు ఆదివారం కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. తాజాగా ఆయన కుమార్తెకు సైతం కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఆమెను చికిత్స కోసం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చేర్పించారు.
కాగా సీఎం బీఎస్ యడ్యూరప్ప సైతం అదే హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రత్యేక వైద్య బృందం ఎప్పటికప్పుడు ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తోందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ఇక తనకు కరోనా సోకినట్లు ట్విటర్ వేదికగా వెల్లడించిన 77 ఏళ్ల సీఎం బీఎస్ యడ్యూరప్ప.. ఇటీవల తనను కలిసినవారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని, హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు.