శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 మే 2020 (09:30 IST)

దేశంలో 70 వేలు దాటిన కరోనా కేసులు.. తెలంగాణలో మళ్లీ వేగం

దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 70 వేలు దాటిపోయింది. గత 24 గంటల్లో మరో 3604 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 70756కు చేరింది. ఇకపోతే, గత 24 గంటల్లో 87 మంది ప్రాణాలు కోల్పోగా, మొత్తం మృతుల సంఖ్య 2293కి చేరినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
మరోవైపు, ఇప్పటివరకు దేశంలో కరోనా నుంచి 22,454 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 46,008 మంది చికిత్స పొందుతున్నారు. అయితే, లాక్డౌన్ అమలవుతున్నప్పటికీ దేశంలో ప్రతి రోజూ కనీసం మూడువేలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం ఇపుడు ఆందోళన కలిగిస్తోంది. 
 
మరోవైపు, తెలంగాణలో కరోనా మళ్లీ పెరుగుతోన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సోమవారం ఒక్కరోజే 79 కేసులు వెలుగు చూశాయి. ఈ మొత్తం కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనివి కావడం గమనార్హం. మొత్తంగా  తెలంగాణలో ఇప్పటివరకు 1275 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, సోమవారం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 50 కాగా, కోలుకున్నవారి సంఖ్య 801కి పెరిగింది. ప్రస్తుతం 444 మంది చికిత్స పొందుతున్నారు. ఇక, మరణాల సంఖ్య 30 అని తెలంగాణ హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.