శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 అక్టోబరు 2020 (17:51 IST)

దావూద్ పూర్వీకుల స్థిరాస్తుల వేలం.. కొనుగోలు చేసేదెవరు?

అండర్ వరల్డ్ డాన్, మాఫియా కింగ్ దావూద్ ఇబ్రహీం పూర్వీకులకు సంబంధించిన ఆస్తులు వేలం వేయనున్నారు. అంటే, దావూద్ తాత, అవ్వలకు సంబంధించిన స్థిరాస్తుల వేలం వచ్చే నెల పదో తేదీన వేలం వేయనున్నారు. 
 
మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా ఖేడ్ తాలూకా కొంకణ్‌ గ్రామంలోని దావూద్‌ పూర్వీకులకు చెందిన ఏడు భూములను స్మగ్లింగ్ అండ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్స్ (ఫోర్ఫ్యూచర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్) (సఫెమా) కింద అధికారులు వేలం వేయనున్నారు. 
 
అంతేగాక దావూద్ చివరి సహాయకుడు, గ్యాంగ్ స్టర్ ఇక్బాల్ మిర్చికి చెందిన రెండు ఫ్లాట్లు కూడా అదే రోజున వేలం వేయనున్నట్లు సమాచారం. అన్ని ఆస్తుల వేలం పాటను సఫెమా అధికారులు పర్యవేక్షించనున్నారు. 
 
ఈ ఆస్తులు కొనదలచిన వారు... వచ్చే నెల రెండో తేదీన ఈ ఆస్తులను స్వయంగా పరిశీలించవచ్చని అధికారులు చెప్పారు. ప్రతి ఆస్తి బిడ్డింగ్‌ కోసం దరఖాస్తుతో పాటు డిపాజిట్ డబ్బు నవంబర్ 6 సాయంత్రం 4 గంటలలోపు తమ కార్యాలయానికి అందాలని పేర్కొన్నారు. 
 
ఈ ఆస్తుల వేలం కోనం ఈ-వేలం, బహిరంగ వేలం, సీలు చేసిన టెండర్ల విధానాలను పాటిస్తామని సంబంధిత అధికారులు వెల్లడించారు. దేశం నుంచి పారిపోయిన దావూద్‌ పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం.