శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 జనవరి 2021 (15:04 IST)

ఎర్రకోట రభస : రైతు సంఘాల నేతలకు లుకౌట్ నోటీసులు

కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రిపబ్లిక్ డే రోజున రైతులు ఢిల్లీలో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. రైతుల ట్రాక్టర్ ర్యాలీని అడ్డుకున్న భద్రతా బలగాలపై దాడులకు దిగారు. ముఖ్యంగా, అనుమతి లేని ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లిన కొందరు ఆందోళనకారులు.. ఎర్రకోటపై జాతీయ జెండాతో పాటు మతపరమైన జెండాను ఎగురవేశారు. ఈ ఘటన కలకలం రేపుతోంది. 
 
రైతుల ముసుగులో ఖలిస్థాన్ మద్దతుదారులు అరాచకాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఖలిస్థాన్ హస్తంపై ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) సైతం రంగంలోకి దిగి, విచారణ ప్రారంభించింది. 
 
ఇదిలావుంటే, కేంద్రం ఆదేశాల మేరకు ఈ అల్లర్లపై ఢిల్లీ పోలీసులు సైతం దర్యాప్తును వేగవంతం చేశారు. రైతుల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న రాకేశ్ తికాయత్, యోగేంద్ర యాదవ్, గుర్నాం సింగ్, దర్శన్ పాల్ సహా పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు, లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అలాగే, పాస్‌పోర్టులను సరెండర్ చేయాలని ఆదేశించారు. 
 
అదేసమయంలో సీనియర్ అధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి సమీక్షను నిర్వహించారు. మొన్నటి అల్లర్లలో గాయపడిన పోలీసులు చికిత్స పొందుతున్న ఆసుపత్రుల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆసుపత్రుల చుట్టూ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. 
 
భారీగా పోలీసులు మోహరించారు. హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎర్రకోట వద్ద కూడా భారీగా బలగాలను మోహరింపజేశారు. ఈ నెలాఖరు వరకు ఎర్రకోటను మూసేశారు. ఆందోళనకారుల దాడిలో దెబ్బతిన్న కోటకు మరమ్మతులు చేస్తారు.