సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 జనవరి 2021 (20:53 IST)

ఎర్రకోటపై జెండా ఎగురేసి ఏం సాధించాం.. ఆ రైతు సంఘాలు వెనక్కి

రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడంపై రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘటన్, భారతీయ కిసాన్ యూనియన్ (భాను) అసంతృప్తి వ్యక్తం చేశాయి. రైతు చట్టాలకు వ్యతిరేకంగా సాగిస్తున్న రైతు ఆందోళనల నుంచి తాము వైదొలుగుతున్నట్టు ఆ రెండు యూనియన్లు బుధవారంనాడు ప్రకటించాయి. 
 
ఎవరికి తోచిన డైరెక్షన్‌లో వారు వెళ్లాలనుకునే వారితో కలిసి తాము ముందుకు వెళ్లాలనుకోవడం లేదని, దీంతో తాము తక్షణం ఆందోళన నుంచి విరమించుకుంటున్నామని రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘటన్ జాతీయ కన్వీనర్ వీఎం సింగ్ తెలిపారు. 
 
రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘటన్, ఆపీస్ బేరర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. బుధవారం జరిగిన హింసకు రాకేష్ తికాయిత్‌ను ఆయన తప్పుపట్టాయి. ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో యోగేంద్ర యాదవ్, ఇతర రైతు నేతలతో పాటు రాకేష్ తికాయిత్ కూడా ఉన్నారు.
 
ఆర్‌కేఎంఎస్ కన్వీనర్ సర్దార్ వీఎం సింగ్ మాట్లాడుతూ.. రిపబ్లిక్ డే నాడు రాజధానిలో జరిగిన సంఘటనలు బాధించాయన్నారు. ఇతరుల ఆధ్వర్యంలో నిరసన కొనసాగించలేమని పేర్కొన్నారు. కొన్ని సంఘాలు ఇతరులు చెప్పినట్లే పనిచేస్తున్నాయని వీఎం సింగ్ ఆరోపించారు. 
 
నిన్నటి ఘటనలు తమను తీవ్రంగా బాధించాయని పేర్కొన్నారు. రాకేశ్ తికాయత్ వంటి నేతల వైఖరితోనే ఉద్రిక్తత నెలకొందన్నారు. అనుకున్న సమయానికి కంటే ముందుగానే ర్యాలీ నిర్వహించడం వల్ల ఉద్రిక్తతలు తలెత్తినట్లు చెప్పారు. ఇతర మార్గాల్లో ర్యాలీని ఎందుకు తీసుకెళ్లారని వీఎం సింగ్ మండిపడ్డారు.
 
ఎర్రకోటపై ఎగిరే త్రివర్ణ పతాకం పూర్వీకుల త్యాగఫలమని.. దానిపై నిన్న జెండా ఎగురవేసి ఏం సాధించామని ప్రశ్నించారు. తాము ఉద్యమం నుంచి తప్పుకోవడానికి నిన్నటి ఘటనే కారణమని స్పష్టం చేశారు.