శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 13 జులై 2023 (11:28 IST)

వర్షం సాక్షిగా... వీడియో కాన్ఫరెన్స్‌లో వివాహం...

marriage
ఉత్తర భారతంలో కుంభవృష్టి కురుస్తుంది. దీంతో అనేక రాష్ట్రాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో పండితులు పెట్టిన ముహూర్తానికే పెళ్లి చేసుకునేందుకు ఓ జంట సిద్ధమైంది. అంతే.. వర్షం సాక్షిగా జంట ఒక్కటైంది. వర్షం కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పెళ్లి తంతు ముగిసింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని సిమ్లా జిల్లాలోని కోటఘర్ ప్రాంతానికి చెందిన ఆశిష్ సింఘాకు, కులు జిల్లాలోని భుంతార్ ప్రాంతానికి చెందిన శివానీ ఠాకూర్‌కు పెళ్లి జరిపించాలని కొద్ది రోజుల క్రితం పెద్దలు ముహూర్తం నిర్ణయించారు. ఇందుకోసం ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. 
 
అయితే, గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో వరదలు తలెత్తాయి. దీంతో రాష్ట్రంలో వరదల ధాటికి రోడ్లు కొట్టుకుపోగా.. మరికొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడి రహదారులు మూసుకుపోయాయి. అలానే, కులు ప్రాంతంలో జనజీవనం స్తంభించిపోయింది.
 
ఈ పరిస్థితుల్లో వధూవరులు కులులో పెళ్లి మండపానికి చేరుకోలేకపోయారు. దీంతో ఆన్‌లైన్లోనే వివాహం జరిపించాలని పెద్దలు నిర్ణయించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆశిష్, శివానీల వివాహం జరిపించారు. 
 
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పెళ్లికి వధూవరుల కుటుంబ సభ్యులతోపాటు మాజీ ఎమ్మెల్యే రాకేశ్ సింగ్ కూడా హాజరయ్యారు. అనుకోని పరిస్థితులు ఎదురైనప్పటికీ.. వెనకడుగు వేయకుండా ముహూర్త సమయానికి పెళ్లి జరిపించడంపై కుటుంబ సభ్యులతోపాటు కొత్త జంటపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.