శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 2 మార్చి 2021 (10:26 IST)

అండమాన్, అస్సాంలో భూప్రకంపనలు

భారతదేశంలో వరుస భూకంపాలు అలజడిని సృష్టిస్తున్నాయి. ఇటీవలకాలంలో ఢిల్లీ – ఎన్‌సీఆర్, బీహార్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా అస్సాం, అండమాన్ నికోబార్ దీవుల్లో భూప్రకంపనలు సంభవించాయి.

సోమవారం అర్థరాత్రి 11.51 గంటలకు అండమాన్ నికోబార్ దీవుల్లో భూమి కంపించింది. అదేవిధంగా మంగళవారం తెల్లవారుజామున 1.32 గంటలకు అస్సాంలోని మొరిగావ్‌లో భూకంపం సంభవించింది.

ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ మంగళవారం ఉదయం వెల్లడించింది. అందరూ నిద్రిస్తున్న వేళ అకస్మాత్తుగా భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు ఇళ్లల్లోనుంచి పరుగులు తీశారు. భయాందోళనతో చాలాసేపటి వరకు బహిరంగ ప్రాంతంలోనే ఉన్నారు.
 
అయితే అండమాన్ నికోబార్ దీవుల్లో సంభవించిన భూకంపం.. రిక్టర్ స్కేల్‌లో 4.2 తీవ్రతగా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది.

దీంతోపాటు అస్సాంలోని మొరిగావ్‌లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 2.9 గా నమోదయిందని తెలిపింది. అయితే ఇప్పటివరకు రెండు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన సమాచారం ఏదీ అందలేదని సీస్మోలజీ అధికారులు వెల్లడించారు.
 
ఉత్తర భారతదేశంలో వరుసగా సంభవిస్తున్న భూకంపాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటీవల ఢిల్లీ – ఎన్‌సీఆర్‌, నోయిడా, బీహార్, ఉత్తరాఖండ్ తదితర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. అయితే స్వల్ప భూకంపాలతో ఎలాంటి ప్రమాదమీలేదని అధికారులు వెల్లడిస్తున్నారు.