గురువారం, 13 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 మార్చి 2021 (10:08 IST)

ఆ రాష్ట్రంలో పెరిగిపోతున్న పేడ దొంగలు.. తలలు పట్టుకుంటున్న ఖాకీలు

సాధారణంగా ఇంటి దొంగలు, ముసుగు దొంగలు, దోపిడీ దొంగలు ఇలాంటి వారిని చూసివుంటారు. కానీ, ఆ రాష్ట్రంలో మాత్రం పేడ దొంగలు ఉన్నారు. ఈ పేడ దొంగల వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారింది. దీంతో ఈ పేడ దొంగలను పట్టుకునేందుకు ఏకంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, చత్తీస్‌గఢ్ ప్రభుత్వం 2020లో గౌ-దాన్ న్యాయ యోజన పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా కిలో ఆవు పేడను రెండు రూపాయలకు కొనుగోలు చేస్తామని ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటన తర్వాత పేడకు ఎక్కడలేని డిమాండ్ వచ్చేసింది.
 
పేడకు డిమాండ్ పెరగడంతో దొంగతనాలు కూడా అంతేస్థాయిలో పెరిగాయి. దీంతో పేడను కాపాడుకోవడానికి ఎవరికివారు సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. 
 
తాజాగా, అంబికాపూర్ మునిసిపాలిటీలో ప్రభుత్వం గౌ-దాన్ కేంద్రం నుంచి ఆవు పేడను దొంగిలిస్తూ ఐదుగురు మహిళలు పట్టుబడ్డారు. వారి నుంచి 45 కేజీల పేడను స్వాధీనం చేసుకున్నారు. 
 
పెరిగిపోతున్న పేడ దొంగతనాలను అరికట్టేందుకు అధికారులు గౌ-దాన్ కేంద్రం వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుకు అధికారులు రెడీ అవుతున్నారు. అంతేకాదు, పేడను కాపాడేందుకు అక్కడ సెక్యూరిటీ గార్డులను కాపలా కూడా పెట్టాలని నిర్ణయించారు.