శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 నవంబరు 2021 (12:49 IST)

సాగు చట్టాల రద్దు రైతుల విజయం : నేతల స్పందన

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద సాగు చట్టాల రద్దుపై వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తీర్మానం చేయనున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రకటించారు. దీనిపై అనేక రాజకీయ పార్టీల నేతల స్పందించారు. ప్రధాని నిర్ణయాన్ని రైతుల విజయంగా అభివర్ణించారు. 
 
ఇదే అంశంపై కాంగ్రెస్ పూర్వాధ్యక్షులు రాహుల్ గాంధీ స్పందిస్తూ, "అన్నదాతలు వారి సత్యాగ్రంతో అహంకారం తలదించేలా చేశారు. అన్యాయంపై విజయం సాధించి రైతులందరికీ శుభాకాంక్షలు. ఇది కేంద్ర ప్రభుత్వపు అహంకార ఓటమి, రైతుల విజయం" అంటూ ఆయన పేర్కొన్నారు. 
 
అలాగే, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ స్పందిస్తూ, గురునానక్ జయంతి రోజున పంజాబీల డిమాండ్లను అంగీకరించి నల్లచట్టాలను రద్దు చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు అంటూ అన్నారు. రైతుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. 
 
అలాగే, టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, సాగు చట్టాలను రద్దు చేయనున్నట్టు ప్రధాని మోడీ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. రైతుల ఆందోళనను కేంద్రం అర్థం చేసుకుందని, ఇది శుభపరిణామని చెప్పారు. 
 
మూడు వివాదాస్పద సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్టే మూడు రాజధానుల నిర్ణయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.