మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 డిశెంబరు 2019 (10:02 IST)

అత్యాచారాల రాజధానిగా భారత్ : రాహుల్ గాంధీ

దేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అత్యాచారాల రాజధానిగా భారత్ మారిందంటూ ఆరోపించారు. దేశంలో పెరుగుతున్న లైంగికదాడుల ఘటనలను చూసి ప్రపంచ సమాజం భారత్‌ను 'రేప్‌లకు రాజధాని' అంటూ ఎద్దేవా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
తన లోక్‌సభ నియోజకవర్గమైన కేరళలోని వయనాడ్‌లో మూడు రోజులు పర్యటనను ముగించుకున్న రాహుల్‌ శనివారం ఓ సదస్సులో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. నరేంద్ర మోడీ రాజకీయ జీవితమంతా ద్వేషం, విభజన, హింసపై ఆధారపడి ఉన్నదని విమర్శించారు. 'ప్రతి రోజు ఓ యువతి లైంగికదాడికి లేదా హత్యకు గురైందన్న వార్తను చదివినప్పుడు తల్లులు, అక్కాచెల్లెళ్లు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అంతర్జాతీయ సమాజం నేడు భారత్‌ను చూసి అవహేళన చేస్తున్నది. భారత్‌ను లైంగికదాడులకు రాజధాని అని ఎద్దేవా చేస్తున్నది' అంటూ వ్యాఖ్యానించారు. 
 
బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సాక్షాత్ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగర్‌పై నమోదైన లైంగిక దాడి కేసును ప్రస్తావిస్తూ, 'బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే లైంగికదాడికి పాల్పడినా ప్రధాని పెదవి విప్పరు. బాధితురాలు, ఆమె బంధువులు ప్రయాణిస్తున్న కారును ఓ లారీ ఢీకొన్నా ప్రధాని మాట్లాడరు. మీ కుమార్తెలను మీరెందుకు కాపాడుకోలేకపోతున్నారని విదేశాలు మనలను ప్రశ్నిస్తున్నాయి' అంటూ రాహుల్ మండిపడ్డారు.