గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 మార్చి 2020 (20:15 IST)

వైరస్ వ్యాప్తి అడ్డుకట్టే లక్ష్యంగా లాక్‌డౌన్ మరింత కఠినం?

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి విషయంలో భారత్ అత్యంత కీలక దశకు అంటే రెండో దశకు చేరుకుంది. మొదటి దశలో పెద్దగా ప్రభావం చూపలేదని చెప్పొచ్చు. అందుకే ఈ రెండో దశను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత సవాల్‌గా స్వీకరించనున్నాయి. ముఖ్యంగా, లాక్‌డౌన్‌లో భాగంగా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 14వ తేదీ వరకు అత్యంత కీలకంకానున్నాయి. అందుకే ఈ 14 రోజులపాటు లాక్‌డౌన్‌ను మరింత కఠినతరంగా అమలు చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. 
 
మంగళవారం సాయంత్రానికి దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1429కి చేరుకుంది. అలాగే, మరణాలు కూడా నాలుగు పదులకు చేరుకున్నాయి. దీంతో ఏప్రిల్ 14వ తేదీనాటికి ఈ మహమ్మారిని అడ్డుకోలమా? అన్నది ఇపుడు ప్రభుత్వం ముందు పెనుసవాల్‌గా మారింది. అందుకే మిగిలిన 14 రోజుల పాటు లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా, కఠినంగా అమలు చేస్తారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 
 
అదేసమయంలో విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన చాలా మందికి 14 రోజుల పాటు విధించిన క్వారంటైన్ పూర్తయింది. ఇలాంటి వారిని త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. పైగా, క్వారంటైన్‌లో ఉన్నవారిలో ఇప్పటికే పది శాతానికి పైగా విడుదల చేయడం జరిగింది. మరోవారం రోజుల్లో వీరి సంఖ్య 50 శాతానికి చేరుకోవచ్చు. 
 
అంటే, ప్రస్తుతానికి కరోనా వైరస్ భారత్‌లో అదుపులోనే ఉందని చెప్పొచ్చు. కానీ, వచ్చే వారం రోజుల్లో ఈ కట్టు ఇలానే కొనసాగితే, భారత్ సురక్షితంగా ఈ మహమ్మారి నుంచి బయటపడటం ఖాయమని ఆరోగ్య వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.