సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 ఆగస్టు 2021 (09:31 IST)

జేఈఈ ఫలితాల విడుదల.. 100 శాతం స్కోరుతో తెలంగాణ విద్యార్థుల రికార్డ్

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన జేఈఈ మెయిన్‌ సెషన్‌, ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ) ఫలితాలు విడుదలయ్యాయి. 2021కు సంబంధించి జులై 20, 22, 25, 27 తేదీల్లో పరీక్షలను నిర్వహించగా.. 7 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను ఎన్టీఏ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. పేపర్ I (BE/BTech)లో తెలంగాణకు చెందిన నలుగురు విద్యార్థులు 100శాతం ఎన్టీఏ స్కోర్ సాధించి రికార్డ్ క్రియేట్ చేశారు.
 
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) శుక్రవారం ప్రకటించిన ఫలితాలలో, పోలు లక్ష్మి సాయి లోకేష్ రెడ్డి, మాదూర్ ఆదర్శ్ రెడ్డి, వెలవలి వెంకట కార్తికేయ సాయి వ్యధిక్ మరియు జోస్యూల వెంకట ఆదిత్య 100శాతం NTA స్కోర్ పొందారు. రాష్ట్రంలో టాపర్స్ కూడా వారే. వివిధ రాష్ట్రాల నుంచి 17మంది విద్యార్థులు JEE మెయిన్ సెషన్-3 లో 100 NTA స్కోర్ పొందారు.
 
బాలికలలో మొదటి 10 స్థానాల్లో, నలుగురు తెలంగాణకు చెందినవారు కాగా.. కొమ్మ శరణ్య 99.9987133 స్కోర్ చేయడం ద్వారా బాలికలలో రెండవ స్థానంలో నిలిచింది, పల్లె భావన 99.9934737 స్కోర్‌తో నాల్గవ స్థానంలో ఉంది, గసద శ్రీ లక్ష్మి 99.9923616 స్కోర్‌తో ఆరవ స్థానంలో నిలిచారు మరియు అంచా ప్రణవి 99.9883036 స్కోరుతో ఎనిమిదో స్థానంలో నిలిచింది.
 
ST కేటగిరీలో, రాష్ట్రానికి చెందిన బిజిలి ప్రచోతన్ వర్మ 99.9649109 స్కోర్‌తో టాపర్‌గా నిలిచారు, తెలంగాణకు చెందిన నేనావత్ ప్రీతం మరియు ఇస్లావత్ నితిన్ వరుసగా 99.9614004 మరియు 99.9614004 స్కోర్‌లతో రెండవ మరియు మూడవ స్థానాల్లో ఉన్నారు. OBC-NCL కేటగిరీలో గసద శ్రీ లక్ష్మి ఐదవ స్థానాన్ని మరియు మల్లుకుంట్ల భాను రంజన్ రెడ్డి 99.3800008 స్కోరుతో నాల్గవ స్థానాన్ని సాధించారు.
 
జేఈఈ మెయిన్ -2021 నాలుగు సెషన్‌ల తర్వాత, ఇప్పటికే చేసిన పాలసీకి అనుగుణంగా నాలుగు NTA స్కోర్‌లలో ఉత్తమమైన వాటిని పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల ర్యాంకులు విడుదల చేయనున్నట్లు NTA తెలిపింది