శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 12 మే 2018 (17:31 IST)

కర్ణాటక ఎన్నికల పోలింగ్: ఓటేసిన వధూవరులు, వృద్ధులు..

కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. బెంగళూరులోని చాలా పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు మొరాయించడంతో కాసేపు పోలింగ్ ఆలస్యమైంది. శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు సుమారు 56 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం

కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. బెంగళూరులోని చాలా పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు మొరాయించడంతో కాసేపు పోలింగ్ ఆలస్యమైంది. శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు సుమారు 56 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 224 శాసనసభ స్థానాల్లో 222 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. 
 
కర్ణాటకలో పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపారు. వధూవరులు, వృద్ధులు ఎండలు మండిపోతున్నా.. క్యూలైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వివాహ అలంకరణలతోపాటు ఓట్లేసిన వధూవరుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో నవ వధూవరులు మల్లికార్జున్, నిఖిత పట్టుబట్టలు, పూలదండల అలంకరణలతో వచ్చి ధార్వాడ్‌లోని 191-ఏ పోలింగ్ బూత్‌లో ఓట్లు వేశారు. 
 
మడికెరిలో పోలింగ్ బూత్‌లో నవ వధువు ఒకరు తన వివాహానికి ముందు వచ్చి ఓటు వేశారు. ఇకపోతే.. బెంగళూరులోని మరో పోలింగ్ బూత్‌లో ఒకే కుటుంబానికి చెందిన 60 మంది ఓటు వేశారు. వీరిలో 95 సంవత్సరాల వృద్ధురాలు బైరమ్మ కూడా ఉన్నారు.
 
అయితే కర్ణాటకలోకి కల్‌బూరగి జిల్లాలోని చిత్తాపూర్ తాలుకా తార్కస్‌పేట్ గ్రామ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ను బహిష్కరించారు. సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని.. తాము ఓటు వేయబోమని తెగేసి చెప్పారు. ఆ గ్రామంలో మొత్తం 3500 మంది జనాభా ఉన్నారు. 
 
కానీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా తుముకూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడులకు పాల్పడ్డారు. విజయనగర నియోజకవర్గంలో ఈ రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. బాదామిలో పోలీస్ స్టేషన్ వద్ద ఇరుపార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. గాయపడ్డ కార్యకర్తలను సమీప ఆసుపత్రికి తరలించారు.