ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 డిశెంబరు 2019 (09:35 IST)

పాకిస్థాన్ నుంచి మరో సమస్య .. గుజరాత్‌పై మిడతల దాడి

గుజరాత్ రాష్ట్రంలోని పంటలపై మిడతల దాడి జరిగింది. ఈ మిడతలు పాకిస్థాన్ దేశంలోని సింధ్ రాష్ట్రం మీదుగా వచ్చి ఈ దాడికి దిగాయి. ఫలితంగా వేలాది హెక్టార్లలోని పంటకు అపార నష్టంవాటిల్లింది. ఆఫ్రికా ఖండంలోని వివిధ దేశాల నుంచి ఈ మిడతల గుంపు ఒక్కసారిగా భారత్‌లోకి చొచ్చుకొచ్చింది. ఈ మిడతల దాడిని అడ్డుకునేందుకు ఏకంగా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగాల్సివచ్చింది. వీటిని నివారణ చర్యల కోసం కేంద్రం 11 బృందాలను గుజరాత్‌కు పంపింది. 
 
ఆఫ్రికాలోని పలు దేశాల నుంచి బయలుదేరిన ఈ మిడతలు పాకిస్థాన్‌ మీదుగా భారత్‌లోకి ప్రవేశించారు. సమూహాలుగా వస్తున్న మిడతలు బనాస్ కాంఠా, మహసానా, కచ్, సాబర్ కాంఠా తదితర ప్రాంతాల్లో ఆవాలు, జీలకర్ర, బంగాళాదుంప, గోధుమ, జీలకర్ర, పత్తి తదితర పంటలను నాశనం చేస్తున్నాయి.
 
బనాస్ కాంఠా జిల్లాలో ఈ మిడతల కారణంగా ఇప్పటివరకూ 5 వేల హెక్టార్లలో పంట నాశనమైంది. మిడతలను ఎదుర్కొనేందుకు గుజరాత్ ప్రభుత్వం నానా తంటాలూ పడుతుండగా, సమస్య తీవ్రతను గమనించిన కేంద్రం, 11 బృందాలను రాష్ట్రానికి పంపింది.
 
డ్రోన్ల సాయంతో క్రిమిసంహారక మందులను చల్లడం ద్వారా వీటిని నివారించవచ్చని అధికారులు భావిస్తున్నప్పటికీ, అదేమంత సులువుగా కనిపించడం లేదు. దీంతో పాటు పొలాల్లో టైర్లను మండించడం, డప్పులు వాయించడం, లౌడ్ స్పీకర్ల ద్వారా పెద్దగా సంగీతాన్ని వినిపించడం ద్వారా మిడతలను చెదరగొట్టవచ్చని ఉన్నతాధికారులు రైతులకు సూచిస్తున్నారు. 
 
అలా చేస్తున్నప్పటికీ పెద్దగా ఫలితం కనిపించడం లేదు. రైతుల నుంచి నిరసనలు పెరుగుతున్న నేపథ్యంలో మిడతల కారణంగా పంట నష్టపోయిన వారికి పరిహారం చెల్లిస్తామని సీఎం విజయ్ రూపానీ వెల్లడించారు.