ముషారఫ్ చచ్చినా సరే... శవాన్ని ఈడ్చుకొచ్చి ఉరికంబానికి వేలాడదీయండి..
దేశద్రోహం కేసులో దోషిగా తేలిన మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ను ఎక్కడున్నా వెతికిపట్టుకోండి. ఒకవేళ శిక్ష అమలు చేయడానికి ముందే చనిపోతే ఆయన శవాన్ని ఈడ్చుకొచ్చి ఉరికంబానికి మూడు రోజుల పాటు వేలాడదీయండి అంటూ పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఉంది. ఇటీవల దేశద్రోహం కేసులో ముషారఫ్‌కు మరణశిక్ష విధిస్తూ పాక్ ప్రత్యేక కోర్టు తీర్పు ఇవ్వగా, పూర్తి వివరాలు గురువారం వెల్లడయ్యాయి.
మరణశిక్ష అమలుకు ముందే ముషారఫ్ ఒకవేళ చనిపోయినా అతడి మృతదేహాన్ని మూడు రోజులపాటు వేలాడదీయాలని ప్రత్యేక కోర్టు తన తీర్పులో పేర్కొంది. ప్రత్యేక కోర్టుకు నేతృత్వం వహించిన పెషావర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వఖార్ అహ్మద్ సేథ్ తీర్పును వెలువరిస్తూ ముషారఫ్‌ను అదుపులోకి తీసుకోవడానికి అన్ని విధాల ప్రయత్నించండి. అనంతరం అతడికి చట్ట ప్రకారం మరణశిక్ష అమలు చేయండి.
ఒకవేళ శిక్ష అమలు కంటే ముందే అతడు చనిపోతే.. అతడి మృతదేహాన్ని ఇస్లామాబాద్‌లోని అధ్యక్ష భవనం, ప్రధాని కార్యాలయం, పార్లమెంట్, సుప్రీంకోర్టు ఉండే ప్రాంతానికి సమీపంలోని డెమోక్రటిక్ చౌక్ (డి.చౌక్)వద్దకు ఈడ్చుకెళ్లి మూడు రోజులపాటు వేలాడదీయండి అని పేర్కొన్నారు. 167 పేజీలున్న ఈ తీర్పుపై పాక్ సైన్యం మరోసారి మండపడింది.
మానవ హక్కులు, మత పరమైన, నాగరికత పరమైన విలువలకు విరుద్ధంగా కోర్టు తీర్పు ఉన్నదని తెలిపింది. తీర్పుపై ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, సైన్యాధిపతి జనరల్ బజ్వా కలిసి చర్చించారని, కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారని, వాటిని త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది.
కాగా, ఈ తీర్పుపై ముషారఫ్ స్పందించారు. పాకిస్థాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆసిఫ్ సయీద్ ఖోసాతన పట్ల ఉన్న వ్యక్తిగత ద్వేషం కారణంగానే తనకు దేశద్రోహం కేసులో మరణశిక్ష విధించారని ఆరోపించారు. అయితే, చీఫ్ జస్టిస్ పేరును నేరుగా ప్రస్తావించలేదు.
ఆరేళ్లపాటు విచారణ తర్వాత ప్రత్యేక న్యాయస్థానం ముషారఫ్‌కు మరణశిక్ష విధించింది. 2016లో ముషారఫ్ విదేశీ ప్రయాణంపై నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తేయడంతో అప్పుటినుంచి ఆయన దుబాయిలో ఉంటున్నారు. తనపై ద్వేషం పెంచుకోవడం వల్లే ఈ తీర్పు వచ్చిందన్నారు.