మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 మార్చి 2021 (07:41 IST)

'ఆప్' సర్కారుకు షాక్.. ఢిల్లీ సర్కార్ అంటే.. లెఫ్టినెంట్ గవర్నరే : కేంద్రం

హస్తినలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ ప్రభుత్వానికి కేంద్రం తేరుకోలేని షాకిచ్చింది. ఢిల్లీ ప్రభుత్వ పాలన మొత్తం ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌కే కట్టబెంట్టింది. అంటే.. ఢిల్లీ సర్కారు అంటే ఇకపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అని నిర్వచించే కీలక బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. 
 
ఆమ్‌ఆద్మీ, కాంగ్రెస్‌ పార్టీ సభ్యుల ఆందోళన మధ్య ‘ది గవర్న్‌మెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ కేపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ (సవరణ) బిల్లు 2021’కు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. పాలనా వ్యవహారాల్లో నెలకొన్న అస్పష్టతను చెరిపేసేందుకు ఈ బిల్లును తెచ్చామని భాజపా చెబుతుండగా.. ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.
 
బిల్లుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. దీన్ని రాజకీయ బిల్లుగా పరిగణించొద్దని సభ్యులకు సూచించారు. కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీలో పాలన విషయంలో ఇప్పటివరకు ఉన్న అస్పష్టతను సరిచేసేందుకు, గందరగోళాన్ని లేదా సాంకేతికంగా ఉన్న అవరోధాలను అధిగమించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చినట్లు వివరించారు. 
 
దీనివల్ల ఢిల్లీలో పాలనా సామర్థ్యం పెరుగుతుందన్నారు. ఏళ్లుగా కేంద్రానికి, ఢిల్లీకి మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలు 2015 నుంచి దెబ్బతిన్నాయని, కొన్ని అంశాలు ఢిల్లీ హైకోర్టు ముందుకెళ్లాయని గుర్తుచేశారు. తామెవరి అధికారాలూ హరించడం లేదని, అలాగే లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు కూడా కొత్తగా ఎలాంటి అధికారాలూ కట్టబెట్టడం లేదని వివరించారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కూడా పాలనాధికారేనని, ప్రభుత్వ రోజువారీ వ్యవహారాల్లో ఆయనకు జోక్యం చేసుకునే హక్కు ఉంటుందన్నారు. 
 
మరోవైపు, ఢిల్లీ ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అని ఈ బిల్లు నిర్వచిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏదైనా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అభిప్రాయం తీసుకోవాలని స్పష్టంచేస్తోంది. ఈ బిల్లు ద్వారా తమ అధికారాలను హరిస్తున్నారని, దీన్ని వెనక్కి తీసుకోవాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ డిమాండ్‌ చేస్తోంది.