ట్రక్‌ను ఢీకొట్టిన టెంపో - 8 మంది దుర్మరణం (Video)
నాసిక్ - ముంబై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ టెంపో వ్యాను ట్రక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రమాద స్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని జిల్లా, ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహారాష్ట్రలోని నాసిక్ - ముంబై జాతీయ రహదారిపై ద్వారకా సర్కిల్ వద్ద ఈ ఘోరం జరిగింది.
నిషాద్‌లో జిరగిన ఓ మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న 16 మంది తిరిగి టెంపోలో సిఐడీసీలో ప్రాంతానికి వెళుతుండగా వాహనం అదుపుతప్పింది. ఆ సమయంలో ఎదురుగా ఇనుప చువ్వలతో వస్తున్న ట్రక్కును టెంపో డ్రైవర్ ఢీకొట్టాడు. దీంతో ఆరుగురు అక్కడే చనిపోయారు. మరికొందరు తీవ్రగా గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారు. దీంతో ప్రమాదంలో చనిపోయినవారి సంఖ్య ఎనిమిదికి చేరింది. అలాగే, గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. కాగా, స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.