ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 ఆగస్టు 2020 (14:56 IST)

మహారాష్ట్రలో 9.5 వేల మందికి కరోనా వైరస్

మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. పోలీస్‌శాఖలో ప్రతిరోజూ కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క మహారాష్ట్రలోనే  ఇప్పటివరకు 9,566 మంది పోలీసులకు కరోనా సోకింది. ఇందులో 988 అధికారులు, 8578 పోలీసు సిబ్బంది వైరస్‌ బారినపడ్డారు. కరోనా వైరస్ కార‌ణంగా పోలీసు విభాగానికి చెందిన 103 మంది సిబ్బంది మృతిచెందారు. 
 
ప్రస్తుతం పోలీస్‌ శాఖలోనే 1929 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు 7534 మంది కోలుకున్నారు. కరోనా వల్ల 9 మంది ఉన్నతాధికారులు, 94 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మార్చి 22 నుంచి కరోనా వైరస్‌ నిబంధనలు, మార్గదర్శకాలు ఉల్లంఘించిన 2,19,975 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీస్‌ శాఖ వెల్లడించింది. పోలీసులపై దాడి కేసుల్లో 883 మంది నిందితులను అరెస్ట్‌ చేసినట్లు తెలిపింది.
 
మరోవైపు, ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. గడిచిన రెండురోజులు రికార్డుస్థాయిలో 10 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా తాజాగా శనివారం 9,276‌ కేసులు నమోదు కాగా 59 మంది మృతి చెందారు. 
 
ఇప్పటివరకు 1,50,209 కరోనా కేసులు నమోదు కాగా 72,118 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 76,614 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
 
1,407 మంది తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ కారణంగా మృతి చెందారు. ఇవాళ ఒక్కరోజే సుమారు 60,797 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇప్పటివరకు 20 లక్షల మందికి పూర్తి చేశామని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.