శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 26 మార్చి 2021 (20:44 IST)

మహారాష్ట్ర లేడీ సింగమ్ దీపాలీ చవాన్ ఆత్మహత్య - ఐఎఫ్ఎస్ అధికారి అరెస్టు

మహారాష్ట్రలో లేడీ సింగమ్‌గా గుర్తింపు పొందిన 28 ఏళ్ల రేంజ్ ఆఫీసర్ దీపాలి చవాన్ మొహితే ఆత్మహత్య చేసుకున్నారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని, ఆయన చేతిలో తాను చిత్రహింసలకు గురయ్యానంటూ ఆమె రాసిన సూసైడ్ నోట్ ఇపుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. 
 
టైగర్ రిజర్వు సమీపంలోని హరిసాల్ గ్రామంలో ఉన్న ఆమె అధికారిక క్వార్టర్స్‌లో తన సర్వీసు రివాల్వర్‌తో గురువారం పొద్దుపోయాక తననుతాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఘటనా స్థలంలోనే ఆమె ప్రాణాలు విడిచారు. 
 
కాగా, తన ధైర్య సాహసాలతో అటవీ మాఫియాకు కంటిమీద కునుకు దూరం చేసిన దీపాలి ‘లేడీ సింగమ్’గా గుర్తింపు పొందారు. దీపాలి భర్త రాజేశ్ మొహితే చిఖల్‌ధారలో ట్రెజరీ అధికారిగా పనిచేస్తున్నారు. దీపాలి తల్లి తన సొంతూరైన సతారాకు వెళ్లిన సమయంలో ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. 
 
కాగా, దీపాలి రాసిన ఆత్మహత్య నోట్ ఇపుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడడంతోపాటు చిత్రహింసలకు గురిచేశాడంటూ దీపాలి తన నాలుగు పేజీల సూసైడ్ నోట్‌ రాసింది. దీంతో ఐఎఫ్ఎస్ అధికారి, అటవీశాఖ డిప్యూటీ కన్జర్వేటర్  (డీసీఎఫ్) వినోద్ శివకుమార్‌ను పోలీసులు నాగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. 
 
బెంగళూరు వెళ్లేందుకు రైలు కోసం ఎదురుచూస్తుండగా అరెస్ట్ చేసిన పోలీసులు అమరావతి తరలించారు. శివకుమార్ తనను గత కొన్ని నెలలుగా లైంగికంగా ఎలా వేధించిందీ, మానసికంగా ఎంతలా టార్చర్ పెట్టిందీ దీపాలి తన నోట్‌లో వివరించారు. అతడు తన అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేసిందీ ఆమె పూసగుచ్చినట్టు పేర్కొన్నారు.  
 
ఇదిలావుంటే, దీపాలి చేసిన ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మాట్లాడుతూ.. ఈ విషయంలో అన్ని కోణాల్లోనూ విచారణ జరిపిస్తామని, నిందితులెవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.